“వార్ 2” కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతంటే?

బాలీవుడ్ మూవీ వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2ను రూపొందించబోతున్నారు. కొద్ది రోజుల క్రితమే కన్ఫర్మ్ అయిన ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ భారీ ఫీజు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

వార్ 2 కోసం ఎన్టీఆర్ 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా..నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ అంగీకరించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కీలకంగా ఉంటూ కొంత నెగిటివ్ షేడ్స్ తో సాగుతుందని తెలుస్తోంది. హృతిక్ తో ఢీ అంటే ఢీ అనేలా ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారట. ఈ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నద్ధం కానున్నారు.

ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నార్త్ లో పాపులర్ అయ్యాడు. ఈ క్రేజ్ తోనే వార్ 2 సినిమాకు ఆయనను టీమ్ సంప్రదించిందని అనుకోవచ్చు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న వార్ 2 సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.