పాలిటిక్స్ లోకి వెళ్లే ఆలోచన లేదు – సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని అన్నారు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్. ఆళ్లగడ్డలోని ప్రముఖ నరసింహస్వామి క్షేత్రమైన అహోబిలం దేవాలయాన్ని సందర్శించారు సాయిదుర్గ తేజ్. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో రాణించడం అంత సులువైన విషయం కాదని, సినిమా హీరోగా గుర్తింపు ఉన్నంతమాత్రాన పాలిటిక్స్ లోకి రావాలనుకోవడం కరెక్ట్ కాదని సాయిదుర్గ తేజ్ అన్నారు.

రాజకీయాల్లో చాలా విషయాలు నేర్చుకోవాలని, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ రోజు సంతోషంగా ఉండటం, నలుగురికి సాయం చేయడం గురించే ఆలోచిస్తానని సాయిదుర్గ తేజ్ చెప్పారు. ప్రస్తుతం సాయి దుర్గతేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకుడు రోహిత్ కేపీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 25న సంబరాల ఏటిగట్టు సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.