సంగీత దర్శకుల్లో కీరవాణికో ప్రత్యేకత ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమా చేయడం ఆయన ప్రత్యేకత. సెకండ్ ఇన్నింగ్స్ కు చేరుకున్నాక పూర్తిగా బయటి సినిమాలకు మ్యూజిక్ చేయడం ఆపేశారు కీరవాణి. దర్శకుడిగా రాజమౌళికి పేరొచ్చాక…కేవలం ఆయన సినిమాలే చేస్తూ వచ్చారు. అప్పుడప్పుడు రాఘవేంద్రరావు సినిమాలకు స్వరాలు అందించారు. ఆయన బయటి సినిమాలు చేయడం చాలా అరుదు.
అయితే ఇటీవల కీరవాణి తన రూటు మార్చారు. ఒకేసారి మల్టిపుల్ సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నారు కీరవాణి. ప్రస్తుతం ఆయన ఖాతాలో చంద్రముఖి 2, జెంటిల్మన్ 2, నాగార్జున కొత్త సినిమా, చిరు యూవీ క్రియేషన్స్ సినిమాలకు ఆయనే సంగీతాన్ని అందిస్తున్నారు. మహేశ్ బాబు రాజమౌళి సినిమాకు కూడా కీరవాణే సంగీతాన్ని అందించబోతున్నారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ ప్రెస్టీజియస్ మూవీస్ కు కీరవాణి మ్యూజిక్ అదనపు ఆకర్షణ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ గెల్చుకున్నాక కీరవాణిని ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు. ఇలా చూస్తే ఇది కీరవాణికి థర్డ్ ఇన్నింగ్స్ లా భావించాలి.