ఇప్పుడే షూటింగ్స్ వద్దంటున్న మెగా హీరో

ఈ ఏడాది మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ కు బాగానే కలిసొచ్చింది. గత కొద్ది కాలంగా ఫ్లాప్స్ చూస్తూ వచ్చిన ఆయనకు మిస్టిక్ థ్రిల్లర్ విరూపాక్ష మంచి హిట్ ఇచ్చింది. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి తిరిగొచ్చి చేసిన సినిమా ఇది. అందుకే విరూపాక్ష హిట్ కావడం తనకు నటుడిగా పునర్జన్మ లాంటిదని సాయి ధరమ్ తేజ్ ఈ చిత్ర ప్రచారంలో చెప్పుకున్నారు. ఇక పవన్ తో నటించాలనే తన చిరకాల కోరికను బ్రో సినిమాతో తీర్చుకున్నారీ హీరో. బ్రో సినిమా ఫలితం ఎలా ఉన్నా…ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో స్పెషల్ అని భావిస్తారు సాయి ధరమ్ తేజ్.

ఈ రెండు సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ చేయబోయే సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. ఆయన ఇప్పటికే రెండు సినిమాలు సైన్ చేశారు. సంపత్ నంది దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేయాల్సిఉంది. అలాగే కొత్త దర్శకుడితో ఎస్వీసీసీ బ్యానర్ లో మరో సినిమాకు అంగీకారం తెలిపారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఇంకా పట్టాలెక్కలేదు.

అయితే ఈ లోగా షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించారట సాయి ధరమ్ తేజ్. బైక్ యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ బ్రేక్ నుంచి రాగానే సంపత్ నంది దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.