జగ్గుభాయ్ బాటలో మంచు మనోజ్

కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు అనే పేరు తెచ్చుకున్నాడు జగపతి బాబు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జగ్గుభాయ్.. లెజెండ్ సినిమాతో రూటు మార్చాడు. విలన్ గా కూడా ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు విలన్ గానే కాకుండా స్టార్ హీరోలకు ఫాదర్ గా కూడా నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పిస్తున్నాడు. ఇప్పుడు మంచు మనోజ్ కూడా జగ్గుభాయ్ బాటలోనే నడవాలి అనుకుంటున్నాడట. అవును.. మంచు మనోజ్ కూడా విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి.

రవితేజ, విష్వక్సేన్ లు హీరోలుగా సందీప్ రాజ్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో రవితేజ, విష్వక్సేన్ లు గురు, శిష్యులుగా నటిస్తున్నారట. ఈ సినిమాలో విలన్ క్యారక్టర్ ను మంచు మనోజ్ చేస్తున్నట్టు సమాచారం. మనోజ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారు. హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన మంచు మనోజ్ ఇప్పుడు విలన్ గా మెప్పించి మళ్లీ బిజీ అవుతాడేమో చూడాలి.