టాలీవుడ్ కి వచ్చినందుకు బాధపడుతున్నాను – మంచు లక్ష్మి

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. నటిగా, హోస్ట్ గా ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. గుండెల్లో గోదారి, వైఫ్‌ ఆఫ్‌ రామ్, దొంగాట.. తదితర చిత్రాల్లో కథానాయికగా నటించింది కానీ.. కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో ఈమధ్య కాలంలో తన నుంచి సినిమాలు రాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తెలుగు హీరోయిన్ల గురించి మంచు లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఇంతకీ ఏమన్నదంటే..  తాను తెలుగు పరిశ్రమకు రాక ముందు పలు హాలీవుడ్ సినిమాలకు పని చేశానని.. అక్కడే ఉండుంటే ఈ పదేళ్లలో ఎక్కడో ఉండేదాన్నని, ఇక్కడికి ఎందుకొచ్చానో అని అనిపిస్తుందని చెప్పింది.

ఆ దేవుడు దయ తలిస్తే మళ్లీ హాలీవుడ్‌కి వెళ్లేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది. అంతే కాకుండా.. తెలుగు ప్రేక్షకులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతారు కానీ.. వారి సొంత రాష్ట్రానికి చెందిన వారిని మాత్రం ఆదరించరు. ఇక్కడి హీరోయిన్లని ఒక్క శాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉంటారు అని చెప్పింది. ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు? బిందు మాధవి, మధుశాలిని, శివాత్మిక, శివాని ఎందుకు చేయడం లేదు? వీళ్లు ఎందులో తక్కువ? అందంతో పాటు టాలెంట్‌ ఉన్న వారే కదా?’’ అని మంచు లక్ష్మి ప్రశ్నించింది.