గతేడాది ఇండియా నుంచి ఛల్లే షో అనే గుజరాతీ మూవీని ఆస్కార్ కు మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా పంపించారు. ఈసారి ఆ అవకాశం మలయాళ మూవీ 2018కు దక్కింది. 2018లో వచ్చిన వరదలు కేరళను ఎలా అతలాకుతలం చేశాయి, ఎంతమంది ప్రాణాలు తీశాయి, ఆ భయంకరమైన వరదల నుంచి ప్రజలు తప్పించుకునేందుకు ఎలాంటి పోరాటం చేశారు అనేది సహజంగా చూపించిన సినిమా ఇది. తెలుగులోనూ 2018 రిలీజైంది.
ఈ సినిమాలో అపర్ణ బాలమురళి, లాల్, నరైన్, కుంచకో బొబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జేడ్ ఆంథొనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. సర్వైవల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న 2018 వచ్చే ఏడాది ఆస్కార్ లో మన దేశం తరుపున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సినిమా ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీగా సెలెక్ట్ అయ్యిందనే సంతోషాన్ని టీమ్ మెంబర్స్ సోషల్ మీడియా ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.