ఖుషి ట్రైలర్ రివ్యూ – విప్లవ్, ఆరాధ్య క్యూట్ లవ్ స్టోరి

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి ట్రైలర్ రిలీజైంది. 2 నిమిషాల 45 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ఓ సినిమా చూసిన ఫీల్ ను, తృప్తిని కలిగించింది. కాశ్మీర్ అందమైన లొకేషన్స్, అక్కడి మంచు కొండల కంటే అందమైన అమ్మాయి బేగంను చూసి లవ్ లో పడిపోతాడు విప్లవ్. తన ప్రేమను చెప్పి ఒప్పించేందుకు విప్లవ్ పడే ఇబ్బందులన్నీ సరదాగా సాగుతూ నవ్వించాయి. హీరోయిన్ సమంత తాను బేగం కాదు బ్రాహ్మిన్ అనే చెప్పే ట్విస్ట్ తో హాఫ్ ట్రైలర్ ముగుస్తుంది.

ఇక్కడి నుంచి వైజాగ్ కు షిప్ట్ అయిన కథలో హీరో హీరోయిన్ల కుటుంబాలకు రెండు భిన్నమైన నేపథ్యాలుంటాయి. ఆరాధ్య, విప్లవ్ పెళ్లికి ఆమె తండ్రి అస్సలు ఒప్పుకోడు. ఈ పెళ్లి జరిగితే దోషం వల్ల
వీళ్ల మధ్య ఏ జంటకూ రానన్ని గొడవలు వస్తాయని చెబుతాడు. ప్రపంచంలో మనకంటే గొప్ప జంట లేదని నిరూపిద్దామంటూ విప్లవతో బయటకు వస్తుంది ఆరాధ్య. అయితే అంత పంతంగా బయటకు వచ్చిన ఈ జంట నిజంగానే వరల్డ్ బెస్ట్ కపుల్ అనిపించుకున్నారా? వీళ్ల మధ్య వచ్చే చిన్న చిన్న విబేధాలు ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి అనే ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ ముగుస్తుంది.

కాశ్మీర్ అందాలను బంధించిన కెమెరా పనితనం, బ్యూటిఫుల్ మ్యూజిక్, క్యారెక్టర్ లోకి మారిపోయిన విజయ్, సమంత నటన, ఇరు కుటుంబాల్లో పేరున్న ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఒక పర్పెక్ట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూసిన ఫీల్ ను ట్రైలర్ తోనే కలిగించారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ కథను, టీమ్ ను నమ్మిన మైత్రీ సంస్థకు మరో హిట్ ఖాయమనే సంకేతాలు పంపింది ఖుషి ట్రైలర్.