రివ్యూ – జైలర్

నటీనటులు – రజనీకాంత్, తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్ తదితరులు

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటింగ్ – నిర్మల్, సంగీతం – అనిరుధ్ రవిచంద్రన్, నిర్మాణం – సన్ పిక్చర్స్, రచన దర్శకత్వం – నెల్సన్ దిలీప్ కుమార్.

కథేంటంటే

ముత్తు వేల్ పాండియన్ (రజనీకాంత్) రిటైర్డ్ జైలర్. ఎంతో నిజాయితీ గల అధికారిగా అతను పేరు తెచ్చుకుంటాడు. భార్య రమ్యకృష్ణ. ఏసీపీగా పనిచేస్తున్న కొడుకు అర్జున్.. ఈ కుటుంబమే ముత్తు ప్రపంచం. అర్జున్ కూడా ముత్తులాగే మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. సంతోషాలతో సరదాగా సాగే ఈ కుటుంబం విగ్రహాలు దొంగిలించే ముఠా వల్ల ఇబ్బందుల్లో పడుతుంది. ఈ ముఠాకు నాయకుడు వర్మ. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వుకుండా ముత్తు తన కుటుంబానికి వచ్చిన ఇబ్బందులను ఎదుర్కోవాలనుకుంటాడు. ముఠా, ఆ ముఠా నాయకుడు వర్మతో ముత్తు ఎలా పోరాడాడు అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

ఇది రజనీ వన్ మ్యాన్ షో లాంటి సినిమా. కుటుంబ పెద్దగా చాలా సహజంగా నటిస్తూ ఆకట్టుకున్నాడు రజనీ. ఫస్ట హాఫ్ అంతా ఎంతో గ్రిప్పింగ్ ఉంటూ ఓ సూపర్ హిట్ సినిమా చూస్తున్న ఫీల్ కలిగిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో రజనీ సరదాగా గడిపే సన్నివేశాలు, యోగిబాబుతో కామెడీ సీన్స్ ఎంటర్ టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్. తన కొడుకు అర్జున్ ను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునే తండ్రిగా రజనీకాంత్ ఎమోషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ముత్తు పాండియన్ పాత్రలో రజనీ నటనతో పాటు మెయిన్ లీడ్ యాక్టర్స్ అంతా బాగా చేశారు. అతిథి పాత్రల్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ మెరుస్తారు. వారి క్యారెక్టర్స్ అదనపు ఆకర్షణగా మారాయి. అనిరుధ్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

ఫస్టాఫ్ తో చూస్తే సెకండాఫ్ లో కొంత కథనం నెమ్మదించింది. విలన్ లు ధీటుగా ఎదుర్కొనేందుకు వెళ్లే ముత్తు వాళ్లు చెప్పినట్లు ప్రవర్తించడం కథను గాడి తప్పేలా చేసింది. రజనీ ప్లాష్ బ్యాక్ సీన్స్ కూడా సహజంగా అనిపించవు. ఫస్టాఫ్ లో నేచురల్ గా రజనీని చూసి..మల్లీ యంగ్ గెటప్ లో ఆయనను చూడటం ఆర్టిఫిషల్ గా ఉంది. ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ సినిమా ఊపందుకుంటుంది. మెప్పించే క్లైమాక్స్ తో జైలర్ ముగుస్తుంది. తన గత సినిమా బీస్ట్ తో భారీ ఫ్లాప్ చూసిన దర్శకుడు నెల్సన్ ఆ కసితోనే ఈ సినిమాను తెరకెక్కించారని అనుకోవచ్చు. అయితే సినిమా తొలి భాగంలో ఉన్నంత స్టఫ్ ను ఆయన సెకండాఫ్ లో పెట్టలేకపోయారు. సెకండాఫ్ ఒక నలభై నిమిషాలు సినిమాను అదే రేంజ్ లో తీసుకెళ్లి ఉంటే ఫలితం అద్భుతంగా ఉండేది. అయినా రజనీ అభిమానులకు ఇదొక ఫీస్ట్ లాంటి సినిమా అనుకోవచ్చు.

చివరగా..”జైలర్” – రజనీ వన్ మ్యాన్ షో