డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది డ్రీమ్. చిరంజీవి రీ ఎంట్రీ మూవీని పూరితోనే చేయాలి అనుకున్నారు. రామ్ చరణ్ స్వయంగా నాన్న రీ ఎంట్రీ మూవీ పూరి డైరెక్షన్ లో అని ప్రకటించడం కూడా జరిగింది. పూరి చిరు కోసం ఆటో జానీ అనే కథ రెడీ చేయడం.. చిరుకు చెప్పడం జరిగింది. అయితే.. ఆ మూవీ ఫస్టాఫ్ నచ్చింది కానీ.. సెకండాఫ్ లో మార్పులు చేర్పులు చేయమని చిరంజీవి చెప్పారు. ఆతర్వాత కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. చిరు వినాయక్ తో ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. పూరి తన సినిమాలతో బిజీ అయ్యారు. మళ్లీ వీరిద్దరి కాంబో గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఇప్పుడు ఆటో జానీ గురించి వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది.
గాడ్ ఫాదర్ మూవీలో పూరి.. గెస్ట్ రోల్ చేశారు. చిరు, పూరి కలిసి సినిమా చేయకపోయినా వీరిద్దరి మధ్య అనుబంధం అలాగే ఉంది. పూరి నెక్ట్స్ మూవీని గోపీచంద్ తో చేయాలి అనుకుంటున్నారు. దీనికి సంబంధించి వర్క్ జరుగుతోంది. అయితే.. గోపీచంద్ వేరే సినిమాలో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి కోరిక మేరకు ఆటోజానీ కథ ద్వితీయార్థంలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట పూరి. ప్రస్తుతం పూరి ఫోకస్ అంతా ఈ కథ పైనే ఉందని టాక్ వినిపిస్తోంది. చిరుతో సినిమా 150వ సినిమా కాకపోతే 160వ సినిమా అయినా చేస్తాను.. అన్నయ్యతో సినిమా తీసి తీరుతానని పూరి అప్పట్లో చెప్పారు. మరి.. పూరి ఈసారి చిరుని మెప్పించి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకువస్తారేమో చూడాలి.