వివాదంలో హీరో విశాల్

కోలీవుడ్ నటుడు విశాల్ అవార్డులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఒకవేళ తనకు జాతీయ అవార్డు వచ్చినా చెత్తబుట్టలో పడేస్తానంటూ విశాల్ చెప్పడంపై చిత్ర పరిశ్రమ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ అవార్డులపై తనకు ఇంట్రెస్ట్ లేదంటూ కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ ఇచ్చాడు.

విశాల్ మాట్లాడుతూ ప్రేక్షకులు ఇచ్చే ప్రశంసల ముందు ఏ అవార్డ్ పనికి రాదన్నాడు. తన దృష్టిలో జాతీయ అవార్డ్ సహా ఏ పురస్కారాల్లో నిజాయితీ లేదన్నాడు. ప్రేక్షకులు ఒక సినిమా చూసి ఇష్టపడితే అదే గొప్ప అవార్డ్ అని విశాల్ అభిప్రాయపడ్డాడు. తనకు ఒకవేళ జాతీయ అవార్డ్ వచ్చినా దాన్ని చెత్తబుట్టలో వేస్తానని చెప్పాడు.

ప్రతి నటుడు, నటి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డ్ లను కించపరిచేలా విశాల్ మాట్లాడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈసారి తెలుగు సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం వల్లే విశాల్ ఇలా మాట్లాడాడా అని టాలీవుడ్ నుంచి కొందరు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.