రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్

బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్నారనే విషయంపై పలువురు టాలీవుడ్ నటీనటులు, యాంకర్స్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హీరో విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్నాడనే రూమర్స్ మీడియాలో ప్రముఖంగా ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్. చట్టప్రకారం పనిచేసే కంపెనీల స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడని ప్రెస్ రిలీజ్ లో విజయ్ టీమ్ తెలిపింది.

ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని, విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా లీగల్ గా అన్ని విషయాలు తెలుసుకున్నాకే చేస్తాడని ఈ ప్రకటనలో వెల్లడించారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదని విజయ్ టీమ్ స్పష్టతనిచ్చారు.