నేనేం చేశానని నాపై ట్రోలింగ్ డైలాగ్స్ పెట్టారు – కిరణ్ అబ్బవరం

సినిమాపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా హీరోగా ఎదిగారు కిరణ్ అబ్బవరం. ఆయన రాజా వారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణమండపం, వినరో భాగ్యము విష్ణుకథ, సమ్మతమే వంటి హిట్ చిత్రాలతో యంగ్ టాలెంటెడ్ హీరోగా ఎదిగారు. ఇలాంటి క్రమంలో తనపై కొందరు చేసిన విమర్శలపై, ట్రోల్స్ బాధించాయని అన్నారు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా జరిగిన క సినిమా ప్రీ రిలీజ్ ఈ‌వెంట్ లో ఇలాంటి వారిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన కెరీర్ తాను చూసుకుంటూ తన సినిమాలే లోకంగా బతుకుతుంటే అనవసరంగా కొందరు టార్గెట్ చేయడాన్ని ప్రశ్నించారు.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – నా కెరీర్ లో 8 సినిమాలు చేస్తే 4 సినిమాలు డీసెంట్ గా ఆడాయి. నేను యాక్టర్ గా ఫెయిల్ కాలేదు. ప్రతి హీరోకు ఫెయిల్యూర్స్ ఉంటాయి. నా లాంటి హీరో తన సినిమాను థియేటర్ దాకా తీసుకురావడమే సక్సెస్. అలా నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తున్న టైమ్ లో ఒకరు తమ సినిమాలో నాపై ట్రోలింగ్ డైలాగ్స్ పెట్టారు. నేను మీకు ఏం చేశానని అలా నన్ను తక్కువ చేసేలా మీ సినిమాలో డైలాగ్స్ పెట్టారు. నాకు బాధగా అనిపించి ఈ వేదిక మీద ఆ విషయం మాట్లాడుతున్నా. అన్నారు.