పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో షూటింగ్ చేస్తోన్న మూవీ హరి హర వీరమల్లు. సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఈ మూవీతో పోటీకి ఇద్దరు హీరోలు సై అంటున్నారు. ఇంతకీ.. ఆ ఇద్దరు హీరోలు ఎవరు..? ఆ రెండు సినిమాలు ఏంటి..?
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓజీ మూవీ ముందుగా రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ.. వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఓజీ మూవీతో పోల్చుకుంటే వీరమల్లు మూవీకి బజ్ లేదు కానీ.. ప్రమోషన్ల ద్వారా బజ్ క్రియేట్ అయ్యేలా నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. బ్యాలన్స్ ఉన్న కొంత భాగాన్ని పూర్తి చేసే పనిలో దర్శకుడు జ్యోతికృష్ణ బిజీగా ఉన్నారు. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మ్యూజిక్ పరంగా ఎంఎం కీరవాణి పవర్ స్టార్ కాంబినేషన్ మీద భారీ అంచనాలున్నాయి. పవన్ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో వీరమల్లు పై మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇదంతా బాగానే ఉంది కానీ హరిహర వీరమల్లుతో పోటీకి ఇద్దరు హీరోలు సై అంటున్నారు. ఎవరా హీరోలు అంటే.. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. లూసీఫర్ మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు లూసీఫర్ మూవీకి సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని అధికారికంగా మార్చి 27న రిలీజ్ చేయనున్నట్టుగా డేట్ ప్రకటించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దీని ప్రభావం గట్టిగానే ఉంటుంది. వీరమల్లతో పోటీకి సై అంటున్న మరో హీరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న సల్మాన్ సికందర్ మూవీ కూడా మార్చి 28 వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీ కూడా మార్చి 28న రిలీజ్ అని ప్రకటించారు కానీ.. వాయిదాపడనున్నట్టు సమాచారం. ఈ లెక్కన వీరమల్లుకు మోహన్ లాల్ లూసీఫర్ 2, సల్మాన్ సికందర్ చిత్రాలతో పోటీ తప్పేలా లేదు. మరి.. ఈ రెండు చిత్రాల పోటీ తట్టుకుని పాన్ ఇండియా రేంజ్ లో వీరమల్లు ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.