జానీ మాస్టర్(Janny master) లైంగిక వేధింపుల కేసుపై ఫిలింఛాంబర్(Telugu film chamber) స్పందించింది. చిత్ర పరిశ్రమలోకి అవకాశాల కోసం వచ్చే మహిళల్ని లైంగికంగా వేధిస్తే వారికి సహాయం చేసేందుకు తాము గతంలో ఆసరా అనే కార్యక్రమం చేపట్టామని, ఇప్పుడు లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ద్వారా బాధిత మహిళలకు సపోర్ట్ ఇస్తున్నామని ఈ ప్యానెల్ సభ్యులు ఝాన్సీ, నిర్మాత దామోదర ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy bharadwaja) కూడా పాల్గొన్నారు.
అవకాశాలు ఇస్తామంటూ మహిళల్ని లైంగికంగా వేధించడం టాలీవుడ్ లో బాగానే జరుగుతోందని ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అయితే ఇవి పెద్దగా బయటకు రావడం లేదని, వచ్చినవారికి ఫిలింఛాంబర్ సపోర్ట్ గా నిలబడుతుందని ఆయన చెప్పారు. ఇక్కడ కెరీర్ కోరుకునే అమ్మాయిలకు మేమున్నామనే ధైర్యాన్ని ఇండస్ట్రీ ఇవ్వలేకపోతోందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. 24 విభాగాల్లో ప్రతి విభాగానికి ఒక లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన అన్నారు. జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేసి మీడియాలో బాగా ప్రచారం అవుతున్నందువల్లే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తోందని భరద్వాజ చెప్పారు.