మెగా ఆఫర్ మిస్ – ఏమైందో చెప్పిన “రాబిన్ హుడ్” డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా వరుసగా సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమధ్య చిరంజీవితో వెంకీ కుడుముల ఓ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. భీష్మ సినిమా తర్వాత వెంకీ కుడుములకు మంచి కథ ఉంటే చెప్పమని మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చింది. వెంకీ కుడుముల చిరు అభిమాని కావడంతో వెళ్లి కథ చెప్పారు. ఆ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట మెగాస్టార్. దీంతో ఈ కాంబోలో మూవీ ఫిక్స్ అంటూ ఇండస్ట్రీలో వినిపించింది.

అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత చిరంజీవి వేరే సినిమాలతో బిజీ అయ్యారు. వెంకీ కుడుముల రాబిన్ హుడ్ రూపొందించాడు. ఇప్పుడు రాబిన్ హుడ్ ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన వెంకీ కుడుములకు చిరుతో సినిమా ఎందుకు ఆగింది అనే ప్రశ్న ఎదురైంది. దీనికి వెంకీ కుడుముల సమాధానం చెబుతూ – చిరంజీవి గారికి ఓ స్టోరీ ఐడియా చెబితే చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత స్టోరీ, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ కి చాలా సమయం తీసుకుని చేశాను. అయితే..ఎక్కడో ఓ చోట ఆయన్ని మెప్పించలేపోయాను. అనుకున్న విధంగా స్క్రిప్ట్ రాలేదు. మరో కథతో వస్తానని చెప్పి వచ్చేశాను..అంటూ ఏం జరిగిందో తెలిపాడు అయితే ఎప్పటికైనా మెగాస్టార్ తో సినిమా చేస్తాననే ప్రయత్నంలో ఉన్నాడీ యంగ్ డైరెక్టర్.