ఇప్పుడు అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అయితే.. రెండు పార్టులుగా సినిమా వస్తుందని అనౌన్స్ చేయడం.. ఆతర్వాత ఫస్ట్ పార్ట్ ప్లాప్ అయితే.. సెకండ్ పార్ట్ తీయకుండా ఆపేయడం కూడా జరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ఫస్ట్ పార్ట్ రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యింది. దేవర సెకండ్ పార్ట్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు కొత్తగా దేవర సెకండ్ పార్ట్ ఉండకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది. అసలు ఏమైంది..?
ఎన్టీఆర్, కొరటాల కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేయడం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఆశించిన స్థాయిలో కాకపోయినా దేవర ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా కావడంతో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అయితే.. మిడ్ నైట్ షోల నుంచి డివైడ్ టాక్ వచ్చింది.. వాటన్నింటినీ తట్టుకుని దేవర బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడం విశేషం. మూడు వారాలకే థియేటర్స్ నుంచి సినిమాలు తీసేస్తున్న ఈ రోజుల్లో దేవర 52 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.
దేవరకు థియేటర్స్ లో మంచి స్పందనే వచ్చింది కానీ.. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా వరకు నెగిటివ్ గానే ఉంది. థియేటర్లలో ఉండగా సోషల్ మీడియాలో నెగెటివిటీని దీటుగా ఎదుర్కొంటూ సినిమాను భుజాల మీద మోసిన తారక్ ఫ్యాన్స్.. ఓటీటీలో వచ్చాక మాత్రం స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనించవచ్చు. దేవర డిజిటల్ రిలీజ్ తర్వాత ఎక్కువగా ఈ సినిమా గురించి నెగెటివ్ కామెంట్లు పెట్టింది తారక్ ఫ్యాన్సే అంటే అతిశయోక్తి కాదు. తాము ఆశించిన స్థాయిలో అయితే సినిమా లేదని.. క్లైమాక్స్ తేలిపోయిందని.. సెకండ్ పార్ట్‌కు ఇచ్చిన లీడ్ బాగా లేదని వాళ్లు కొన్ని రోజుటుగా పోస్టులు పెడుతున్నారు. వీళ్ల ఫీడ్ బ్యాక్‌తో ఆవేదన నుంచి వస్తున్నట్లే కనిపిస్తోంది. దాన్ని జెన్యూన్‌గానే భావించవచ్చు. ఇలా దేవర పై నెగిటివ్ ఉండడం.. దేవర 2 పై అంతగా ఆసక్తి లేదని సోషల్ మీడియాలో చెబుతుండడంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. అందుకనే దేవర 2 ఉండకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ వార్ 2 తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు టాక్ వచ్చింది. దేవర 2 లేకపోవడం వలనే నెల్సన్ కు ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. మరి.. ఇది నిజమోకాదో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.