గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇక విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తుండడం విశేషం. ఆచార్య ఫ్లాప్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలని కొరటాల కసితో ఈ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ ల పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇంగ్లీషు వెర్షెన్ లో కూడా రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో నిజంగా దేవర ఇంగ్లీషు వెర్షెన్ లో కూడా విడుదల కానుందా అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై దేవర అఫిసియల్ టీమ్ స్పందించింది. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. మరి.. దేవర మూవీతో కొరటాల మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.