ఒడిశాలోని బహనాగ్ బజార్ స్టేషన్ వద్ద ఘోర విషాదం
400 మందికిపైగా తీవ్ర గాయాలు
పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
పక్క ట్రాక్‌పై పడ్డ కోచ్‌లు.. అటుగా వచ్చిన బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్
ట్రాక్‌పై పడ్డ కోచ్‌లను ఢీకొని.. ఆ రైల్లోని బోగీలూ పట్టాలు తప్పిన వైనం
తిరగబడిపోయిన బోగీల కింద చిక్కుకున్న వందలాది మంది ప్రయాణికులు
సహాయకచర్యలకు అడ్డంకిగా మారిన చీకటి.. మృతుల సంఖ్య పెరిగే ముప్పు
జాతీయ, ఒడిశా విపత్తు స్పందన దళాలకు చెందిన 600 మంది రంగంలోకి
ముమ్మర సహాయకచర్యలు..
115 అంబులెన్సుల్లో ఆస్పత్రులకు క్షతగాత్రులు
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొంది. దాదాపు 15 కోచ్‌లు పట్టాలు తప్పగా.. వాటిలో ఏడు తిరగబడిపోయినట్టు సమాచారం. వాటిలో కొన్ని పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి. కొద్దిసేపటికి.. ఆ రెండో ట్రాక్ మీదుగా హౌరాకు వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 12864) ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొంది. ఆ తాకిడికి బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రె్‌సకు చెందిన నాలుగైదు బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. తిరగబడిపోయిన బోగీల కింద వందలమంది చిక్కుకుపోయారు. ఆ బోగీల కింద నుంచి దాదాపు 70 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య వందకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరగబడ్డ కోచ్‌ల కింద చిక్కుకుపోయి.. ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి.. కాపాడాలంటూ హృదయవిదారకంగా వారు చేస్తున్న ఆర్తనాదాలు.. చెల్లాచెదురుగా పడిన బోగీలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. సహాయకచర్యలకు చీకటి అడ్డంకిగా మారింది. వారిని ఆ బోగీల నుంచి తీసి ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది. ఫలితంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రె్‌సలలో ఏది తొలుత పట్టాలు తప్పి ప్రమాదానికి గురైందనే విషయంపై రెండు రకాల కథనాలు వినిపించాయి. తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్సేనంటూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కానీ.. మొదట పట్టాలు తప్పింది కోరమాండలేనని రైల్వే అధికార ప్రతినిధి అమితాభ్ శర్మ స్పష్టం చేశారు.
ముమ్మరంగా సహాయకచర్యలు..
ప్రమాదం గురించి తెలియగానే జాతీయ విపత్తు స్పందన దళాలకు చెందిన నాలుగు బృందాలు.. ఒడిశా విపత్తు స్పందన దళాలకు చెందిన నాలుగు యూనిట్లు.. రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. ఈ రెండు విభాగాలకూ చెందిన 600 మందికి స్థానికులు కూడా తోడై బోగీల కింద చిక్కుకున్నవారిని బయటకు తీయడం ప్రారంభించారు. గాయపడినవారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 50 మంది వైద్యులను.. క్షతగాత్రుల తరలింపునకు 115 అంబులెన్సులను రప్పించారు. గాయపడ్డవారిలో 47 మందిని బాలాసోర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు.. 132 మందిని సమీపంలో ఉన్న సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. తక్షణం ఘటనాస్థలి వద్దకు చేరుకుని సహాయకర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఆ రాష్ట్ర మంత్రి ప్రమీలా వుమాలిక్‌ను, స్పెషల్ రిలీఫ్ సెక్రటరీ సత్యవ్రత సాహూను ఆదేశించారు. అలాగే.. ప్రమాద స్థలికి వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లను పంపించినట్టు ఆగ్నేయ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. తీవ్రగాయాలపాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్పగాయాలు అయినవారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తాను వెంటనే ప్రమాదస్థలికి బయల్దేరుతున్నట్టు ట్వీట్ చేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘోర ప్రమాదం గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. షాలిమార్ నుంచి బయల్దేరిన ఈ రైలు చెన్నైకు ప్రయాణించే క్రమంలో ప్రమాదానికి గురవడంతో.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే స్పందించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. రైల్లో ఉన్న తమిళులను కాపాడేందుకు.. రాష్ట్ర రవాణా మంత్రి ఎస్‌ఎస్ శివశంకర్‌ను, మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఒడిశాకు పంపించి సహాయకచర్యల్లో పాలుపంచుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు. అటు.. పశ్చిమబెంగాల్ సర్కారు కూడా దీనిపై వేగంగా స్పందించింది. రాష్ట్ర మంత్రి మానస్ భునియా, ఎంపీ డోలాసేన్ నేతృత్వంలోని ఒక బృందాన్ని ఒడిశాకు పంపుతున్నట్టు ప్రకటించింది. పరిస్థితిని తాను స్వయంగా సమీక్షిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వం, ఆగ్నేయ రైల్వేతో సమన్వయం చేసుకుంటూ సహాయకచర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు..
18 రైళ్ల రద్దు..
రైలు ప్రమాదం నేపథ్యంలో.. 18 రైళ్లను రద్దు చేశారు. ఆ మార్గంలో వెళ్లే కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదం జరిగే సమయానికి ఖరగ్‌పూర్‌లో ఉన్న చెన్నై-హౌరా (12480) రైలును జరోలీ మీదుగా పంపించారు. అలాగే.. వాస్కోడిగామా-షాలీమార్ (18048) రైలును కటక్ మీదుగా పంపించారు. సికింద్రాబాద్-షాలీమార్ వీక్లీ (22850) రైలును కటక్ మీదుగా నడుపుతున్నారు. హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12837), హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12863), హౌరా చెన్నై మెయిల్ (12839), హౌరా-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (20831) రైళ్లను రద్దు చేశారు. ప్రధాని చేతుల మీదుగా శనివారం జరగాల్సిన గోవా-ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవాన్ని కూడా రద్దు చేశారు.
ఇవీ హెల్ప్‌లైన్ నంబర్లు
ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒక హెల్ప్‌లైన్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రైల్వే శాఖ మరికొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటుచేశాయి. ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు.
విశాఖపట్నం
0891-2746330, 0891-2744619
విజయనగరం
0892-2221202, 0892-2221206
శ్రీకాకుళం
0894-2286213, 0894-2286245
ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నంబర్
06782262286
రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లు
హౌరా 033-26382217
ఖరగ్‌పూర్ 8972073925
బాలాసోర్ 8249591559
చెన్నై 044-25330952
పశ్చిమబెంగాల్ సర్కారు హెల్ప్‌లైన్ నంబర్లు
033-22143526, 033-22535185
వేగంగా స్పందించిన స్థానికులు
ప్రమాదం జరగిన గంట దాకా సహాయక బృందాలుగానీ.. అంబులెన్సులుగానీ అక్కడికి చేరుకోలేదని పలువురు క్షతగాత్రులు ఆవేదన వెలిబుచ్చారు. స్థానికులు మాత్రం పరుగుపరుగున అక్కడికి చేరుకుని తమను బయటకు తీసుకువచ్చారని తెలిపారు. పడిపోయిన రైలు బోగీలపైకి స్థానికులు ఎక్కి లోపలున్నవారిని బయటకు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయ్యాయి.
దేశ చరిత్రలోనే ఘోర రైలు ప్రమాదాలు..
1981లో బిహార్‌లోని సహస్ర వద్ద జరిగిన ఘటనలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునగడంతో 500 మంది వరకు మరణించారు.
1995లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ కలిండ్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న ఘటనలో 358 మంది చనిపోయారు.
1999లో అసోంలోని గైసోల్ వద్ద జరిగిన రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 290 మంది చనిపోయారు. ప్రమాద తీవ్రతకు పేలుడు కూడా సంభవించింది.
1998లో కోల్‌కతా వెళుతున్న జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ ఖన్నా-లుఽథియానా సెక్షన్‌లో పట్టాలు తప్పిన గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను ఢీకొట్టడంతో 212 మంది ప్రాణాలు కోల్పోయారు
2002లో హౌరా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 140 మంది వరకు చనిపోయారు.
2010లో హౌరా నుంచి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు వల్ల పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొట్టిన ఘటనలో 170 మంది దాకా చనిపోయారు.
2016లో ఇండోర్ నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పిన ప్రమాదంలో 150 మంది వరకు చనిపోయారు.
2005లో తెలంగాణలోని వలిగొండ వద్ద ఒక్కసారిగా వచ్చిన వరదకు రైలు వంతెన కొట్టుకుపోవడంతో ఓ డెల్టా పాసింజర్ రైలు పట్టాలు తప్పి 114 మంది దుర్మరణం చెందారు..
ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు రైల్వే శాఖ ఆదేశం
ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి
రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం
సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి
బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం
దర్యాప్తుకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం
ప్రస్తుతం సహాయక చర్యల మీదే ఫోకస్ పెట్టాం
విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం
– కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
ఆపరేషనల్ కారణాల వల్ల విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది.
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన
విజయవాడ డివిజన్ మీదుగా వెళ్లే 12 రైళ్లు రద్దు
ఒడిశా ప్రమాదం క్రమంలో మరికొన్ని రైళ్లు క్యాన్సిల్
South Central Railway: పలు కారణాల వల్ల ఏపీలో ప్రయాణించే 12 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏడు రోజుల పాటు రద్దు చేసింది. విజయవాడ-రాజమండ్రి(07459), రాజమండ్రి-విజయవాడ(07460), రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం- రాజమండ్రి(07467), కాకినాడ పోర్ట్ -విశాఖపట్నం(17267), విశాఖపట్నం- కాకినాడ పోర్ట్(17268), కాకినాడ పోర్ట్ -విజయవాడ(17258), విజయవాడ -కాకినాడ పోర్ట్(17257), గుంటూరు -విశాఖపట్నం(17239), విశాఖపట్నం -గుంటూరు(17240), విశాఖపట్నం- విజయవాడ(22701), విజయవాడ- విశాఖపట్నం(22702) ట్రైన్లను 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రద్దు చేశారు.
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల కుటుంబసభ్యులకు సహాయం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ- 0866 2576924, రాజమండ్రి- 08832420541, సామర్లకొట-7780741268, నెల్లూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడురు-08624250795, ఏలూరు-08812232267 నెంబర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏపీకి చెందిన పలువురు ప్రయాణికులు కూాడా ఈ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 70 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. నేడు దాదాపు 50 రైళ్లను రద్దు చేయగా.. 38 రైళ్లను దారి మళ్లించారు. హోరా-తిరుపతి(20889), హోరా-సికింద్రాబాద్(12703), హోరా-హైదరాబాద్(18045) రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-షాలిమార్(22850), వాస్కోడగామా-షాలిమార్(18048) రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించనుండగా.. చెన్నై సెంట్రల్-హౌరా(12840) ట్రైన్‌ను జరోలి మీదుగా, బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా మళ్లించనున్నారు. హౌరా-పూరీ(12837), హౌరా-బెంగళూరు(12863), హౌరా-చెన్నై మెయిల్(12839), హౌరా-సంబల్‌పూర్(20831), సంత్రగాచి-పూరీ(02837), కన్యాకుమారి-హోరా(1266), చెన్నై సెంట్రల్-హౌరా(12842), బెంగళూరు- రైళ్లను నేడు రద్దు చేశారు.
నేడు గోవా-ముంబై వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఒడిశా ప్రమాదం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 230 మంది వరకు మరణించగా.. 900 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మూడు రైళ్లు ఢీకొనడంతో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరగ్గా… సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాత్రి కావడంతో సహాయకచర్యలు నెమ్మదిగా జరగ్గా.. ఉదయం నుంచి వేగంగా చేపడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇవాళ ఉదయం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా కాసేపట్లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.