కమెడియన్ సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. అనుకోకుండా పరుగు సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాల్సివచ్చింది. అక్కడ నుంచి నటుడుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ప్రేమకథా చిత్రమ్ లో పాత్రకు తగ్గట్టుగా నటించి బాగా ఎంటర్ టైన్ చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక అక్కడ నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కమెడియన్ నుంచి కథానాయకుడుగా కూడా సినిమాలు చేసి మెప్పించాడు. ఇటీవల అన్ స్టాపబుల్ అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు సప్తగిరి. కమెడియన్ సప్తగిరి ఏంటి..? రాజకీయాల్లోకి రావడం ఏంటి..? అనుకుంటున్నారా..? ఇదేదో గ్యాసిప్ అనుకుంటే పొరపాటే. అవును.. సప్తగిరి నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ నెల 15న కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు సప్తగిరి. ఇటివలే రాజకీయ రంగ ప్రవేశం గురించి సప్తగిరి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మనం ఎన్నో చూశాం. నిజాయతీ, నిబద్ధతతో ఇండస్ట్రీలో ఎలా అయితే మంచి పేరు సంపాదించుకున్నానో అలాగే, పాలిటిక్స్‌లోనూ పని చేస్తానని జిల్లా ప్రజలకు మాటిస్తున్నా అని చెప్పారు సప్తరిగి. మరి.. నటుడుగా రాణించిన సప్తగిరి రాజకీయ నాయకుడుగా కూడా రాణిస్తాడేమో చూడాలి.