ట్విట్టర్ లో మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఇవాళ్టికి 25 ఏళ్లవుతోంది. 1998 అక్టోబర్ 2న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు మెగాస్టార్. ఇందులో భాగంగా బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ సేవలందిస్తోంది. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఆయన ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మహాత్ముడి జయంతి రోజు ప్రారంభించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లోని బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటిదాకా పది లక్షల మందికి పైగా రక్త దానం చేశామని, వేలాది కుటుంబాల్లో కంటి చూపు నింపగలిగామని మెగాస్టార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. తన వంతుగా సమాజానికి, దేశానికి ఇలా సేవ చేసే అవకాశం రావడం వెలకట్టలేనిదని, ఎంతో సంతృప్తిని అందిస్తోందని చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఎంతోమంది ఔత్సాహిక వాలంటీర్లు, సిబ్బంది, అభిమానుల వల్లే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఇంత దిగ్విజయంగా ముందుకు సాగుతోందని చిరంజీవి అన్నారు. మహాత్ముడికి అంకితంగా తాను దేశానికి ఈ సేవ చేయగలిగాను అని చిరంజీవి ట్వీట్ చేశారు.