హీరో సిద్ధార్థ్ కు బెంగుళూరులో చేదు అనుభవం, సారీ చెప్పిన ప్రకాష్ రాజ్

హీరో సిద్ధార్థ్ తన కొత్త సినిమా చిత్తా ప్రమోషన్ కోసం బెంగళూరు వెళ్లగా అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ హోటల్లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరుగుతుండగా..అక్కడికి కొందరు కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు వచ్చి తమిళ హీరోకు ఇక్కడేం పని అంటూ సిద్ధార్థ్ ను వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. తమిళ హీరోల సినిమాలను ఎంకరేజ్ చేయొద్దంటూ మీడియా వారికి సూచించారు. ఈ నిరసన కార్యక్రమంతో సిద్దార్థ్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారు.

ఈ గొడవపై ప్రకాష్ రాజ్ స్పందించారు. రాజకీయ నాయకులను నిలదీయాల్సిన విషయంలో కళాకారులను ప్రశ్నించడం ఏంటని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దశాబ్దాల ఈ గొడవ సమసిపోవాలంటే రాజకీయంగా చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. కావేరీ నదీ జలాల పంపకంపై వివాదం ఎన్నో ఏళ్లుగా తమిళ, కన్నడ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. సిద్ధార్థ్ హీరోగా నటించిన చిత్తా సినిమా తమిళ, కన్నడలో నిన్న రిలీజైంది. ఈ సినిమా తెలుగులోనూ చిన్నా పేరుతో రాబోతోంది.