పుకార్లతో రాక్షసానందం పొందుతున్నారు – భోళాశంకర్ నిర్మాత అనిల్ సుంకర

సినిమా ఫ్లాపైన బాధల్లో తాముంటే కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శలు చేశారు భోళా శంకర్ సినిమా నిర్మాత అనిల్ సుంకర. ఇవాళ ఆయన చేసిన ట్వీట్ ఈ సినిమా ఎఫెక్ట్ తమ సంస్థ మీద ఎంతగా పడిందో చూపించింది. చిరంజీవికి తనకు మధ్య విబేధాలు వచ్చిన విషయాన్నీ ఈ ట్వీట్ లో ఖండించారు అనిల్ సుంకర. త్వరలోనే కొత్త సినిమాతో తిరిగొస్తామని ఆయన ఆశాభావం వెల్లడించారు.

అనిల్ సుంకర ట్వీట్ లో – పుకార్లను పుట్టిస్తూ కొందరు రాక్షసానందం పొందుతుంటారు. అయితే వారి అసత్య ప్రచారాలు ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న సంస్థల ఇమేజ్ ను పాడుచేస్తాయని గుర్తుంచుకోవాలి. ఆ సంస్థలో భాగమైన వారందరినీ క్షోభకు గురిచేస్తాయని గుర్తుంచుకోవాలి. చిరంజీవి గారితో నాకు విబేధాలు వచ్చాయనే వార్తల్లోనూ నిజం లేదు. మా మధ్య ఇప్పటికీ మంచి రిలేషన్స్ ఉన్నాయి. మీ ద్వేషం నిజాల్ని దాచేస్తోంది. ఈ కష్టకాలంలో మాకు ధైర్యం చెప్పిన సన్నిహితులకు థాంక్స్. త్వరలోనే కొత్త సినిమాతో మీ ముందుకొస్తాం. అని పేర్కొన్నారు.

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించి భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. రిలీజైన ఆరో రోజున ఈ సినిమాకు కలెక్షన్స్ పూర్తిగా ఆగిపోయాయి. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ కథ ఆరు రోజుల్లోనే ముగిసింది. ఫుల్ రన్ లో కేవలం 27 కోట్ల రూపాయలు మాత్రమే దక్కించుకుంది భోళా శంకర్. ఈ సినిమాకు అయిన బిజినెస్ చూస్తే 50 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిల్చింది.