నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, కృష్ణ చైతన్య, తదితరులు.
టెక్నికల్ టీమ్ : ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి, సంగీతం – చేతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని, నిర్మాతలు – కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, రచన, దర్శకత్వం – ఉదయ్ శెట్టి
బేబితో వంద కోట్ల గ్రాసర్ మూవీ చేసి యంగ్ హీరోల్లో తనకో స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్నారు ఆనంద్ దేవరకొండ. పక్కింటి అబ్బాయి ఇమేజ్ తో సాఫ్ట్ క్యారెక్టర్స్ లో కనిపించే ఆనంద్ ఫస్ట్ టైమ్ గం గం గణేశా చిత్రంతో ఒక ఎనర్జిటిక్ హైపర్ రోల్ ప్లే చేశారు. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ లో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రాన్ని ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన గం గం గణేశా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
గణేష్ (ఆనంద్ దేవరకొండ) ఒక అనాథ. స్నేహితుడు శంకర్ (జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్) తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. గణేష్ చాలా హైపర్ నవ్వుతాడు, ఏడుస్తాడు, అబద్ధాలు చెబుతాడు. గణేష్ శృతి (నయన్ సారిక)తో ప్రేమలో ఉంటాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుంది శృతి. గణేష్ హర్ట్ అవుతాడు. డబ్బున్న వాడని శృతి పెళ్లికి ఒప్పుకుందని, తను అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తానని శృతికి ఛాలెంజ్ చేస్తాడు గణేష్. ఈ క్రమంలో ఓ డీల్ ఒప్పుకుంటాడు. ఆ డీల్ ఏంటి, దాని ద్వారా గణేష్ ఎంత డబ్బు సంపాదించాలనుకున్నాడు. మరోవైపు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టేందుకు వంద కోట్ల రూపాయలను గణేష్ విగ్రహంలో పెట్టి ముంబై నుంచి కర్నూలుకు తరలించే ప్రయత్నం చేస్తాడు రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకుడు కిషోర్ రెడ్డి. ఈ వంద కోట్ల రూపాయల డబ్బుకు, గణేష్ ఒప్పుకున్న డీల్ కు సంబంధం ఏంటి, శృతికి చేసిన ఛాలెంజ్ లో గణేష్ గెలిచాడా లేదా అలివేలు (ప్రగతి శ్రీవాస్తవ)తో గణేష్ ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే
క్రైమ్ కామెడీ జానర్ లో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ గం గం గణేశా. క్రైమ్ కామెడీస్ బేసిక్ లైన్ అంతా ఒకేలా ఉంటుంది. భారీ మొత్తం డబ్బు లేదా విలువైన ఓ వస్తువు కోసం కథలోని దాదాపు అన్ని క్యారెక్టర్స్ తమ ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఈ సినిమాలో భయం, అత్యాశ, కుట్ర అనే మూడు హుక్ పాయింట్స్ తో కథను లింకప్ చేస్తూ ట్విస్ట్ లు, టర్న్ లతో కథను నడిపాడు దర్శకుడు ఉదయ్ శెట్టి. అతనికిది కొత్త సినిమా. సక్సెస్ ఫుల్ జానర్ లో గం గం గణేశా సినిమాను కాన్ఫిడెంట్ గా తెరకెక్కించాడు.
ఆనంద్ దేవరకొండకు పర్ ఫార్మెన్స్, లుక్స్, మేకోవర్ పరంగా ఈ సినిమా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఆనంద్ గతంలో చేసిన పాత్రలన్నింటికీ భిన్నమైనది గణేష్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లో ఎంతో ఎనర్జిటిక్ గా, ఫంకీగా పర్ ఫార్మ్ చేశాడు ఆనంద్. అతని కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఇలా హైపర్ గా ఆనంద్ ను తెరపై చూడటం ప్రేక్షకులకు ఖచ్చితంగా కొత్త ఫీల్ కలిగిస్తుంది. ఆనంద్ స్నేహితుడిగా శంకర్ పాత్రలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తన కామెడీ పంచ్ లతో నవ్వించాడు.
రాయలసీమ రాజకీయ నాయకుడు కిషోర్ రెడ్డి పాత్రలో హిందీ నటుడు రాజ్ అర్జున్ ఆకట్టుకున్నాడు. అతనిది సినిమాలో కీ రోల్. కిషోర్ రెడ్డి కోసం డబ్బు తరలించే విలన్ రుద్ర పాత్రలో కృష్ణ చైతన్య కూడా త్రూ ఔట్ మూవీ ఉన్నాడు. హీరోయిన్స్ లో నయన్ సారిక ఓ పాటలో మెరిసి, ఓ చిన్న రొమాంటిక్ సీన్ లో థ్రిల్ చేసింది. ప్రగతి శ్రీవాస్తవ సెకండాఫ్ లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. ఆర్గాన్ డేవిడ్ గా వెన్నెల కిషోర్ తన ప్రతి సీన్ లో నవ్వించాడు. రాజావారుగా సత్యం రాజేశ్ ది కీలక పాత్ర. ఈ సినిమాలో చాలా పాత్రలు కథను ముందుకు నడిపించేంత ప్రధానంగా ఉండటం విశేషం.
ముంబై నుంచి గణేష్ విగ్రహంలో వంద కోట్ల రూపాయలు తరలించడం, అదే విగ్రహంలో అనుకోకుండా హీరో సంపాదించిన విలువైన వజ్రం పడిపోవడం, ఆ విగ్రహం మారి మరొక ఊరికి చేరడంతో కథలో అనేక ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటాయి. హీరో తన వజ్రాన్ని, విలన్ తన వంద కోట్ల రూపాయలను గణేశుడి విగ్రహం నుంచి తిరిగి సంపాదించుకునేందుకు చేసిన ఫీట్లు ఎంటర్ టైన్ చేస్తాయి. థియేటర్ లోనే ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. నేచురల్ అప్రోచ్ ఉన్న మూవీస్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ కెరీర్ లో గం గం గణేశా ఓ డిఫరెంట్ మూవీగా మిగిలిపోతుంది.
రేటింగ్ 3/5