రివ్యూ – షరతులు వర్తిస్తాయి

నటీనటులు – చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటింగ్ – సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్, సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – ప్రిన్స్ హెన్రీ, మ్యూజిక్ – అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల), డైలాగ్స్ – పెద్దింటి అశోక్ కుమార్, ప్రొడ్యూసర్స్ – శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు, రచన దర్శకత్వం – కుమారస్వామి (అక్షర)

ఇటీవల చిన్న సినిమాలే టాలీవుడ్ లో పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న చిత్రాలు స్టార్ హీరోల మూవీస్ ను కూడా బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తున్నాయి. ఇలాంటి అంచనాలు కనిపించిన లేటేస్ట్ మూవీ షరతులు వర్తిస్తాయి. టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ తో ఈ మూవీ మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇవాళ థియేటర్స్ లోకి వచ్చిన షరతులు వర్తిస్తాయి సినిమా మరి ఆ అంచనాలను ఏమేరకు నిలబెట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

కుటుంబం పట్ల బాధ్యత గల యువకుడు చిరంజీవి (చైతన్య రావ్). అతనిది మధ్య తరగతి కుటుంబం. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తుంటాడు. స్టేషనరీ షాప్ లో పనిచేసే విజయశాంతి (భూమి శెట్టి)తో చిరంజీవికి చిన్నప్పటి నుంచి స్నేహం ఉంటుంది. కొన్నాళ్లకు వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఆ ఊరిలోకి గోల్డెన్ ప్లేట్ అనే చిట్టీల కంపెనీ అడుగుపెడుతుంది. ఈ బిజినెస్ లో డబ్బులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఊరి వాళ్లకు ఆశ చూపిస్తారు ఆ సంస్థ ప్రతినిధులు. చిరంజీవి ఇలాంటివి నమ్మక పోగా..ఎవర్నీ డబ్బులు పెట్టొద్దని చెబుతాడు. చిరంజీవి ఉద్యోగ రీత్యా వేరే ఊరికి వెళ్లిన సమయంలో ఆయన భార్య, తల్లి గోల్టెన్ ప్లేట్ చిట్టీల కంపెనీలో డబ్బులు పెడతారు. ఆ డబ్బంతా చిరంజీవి అప్పులు కట్టేందుకు, భార్య విజయశాంతికి సొంత స్టేషనరీ షాప్ పెట్టాలని దాచినది. ఇంతలో ఆ కంపెనీ మోసానికి పాల్పడుతుంది. ఊరి వాళ్లతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా మోసపోతారు. గోల్డ్ ప్లేట్ అనే ఆ కంపెనీ ఎవరిది, మోసపోయిన చిరంజీవికి, ఆ ఊరి జనాలకు డబ్బులు తిరిగి వచ్చాయా, కార్పొరేటర్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచారు. ఈ మోసానికి వ్యతిరేకంగా చిరంజీవి ఏం చేశాడు అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

నాటకీయత, కమర్షియాలిటీకి సహజత్వాన్ని జోడించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన చిత్రమే షరతులు వర్తిస్తాయి. తెలంగాణ రూరల్ జీవితాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని మన కళ్ల ముందు చూస్తున్నట్లు తెరకెక్కించారు. సినిమా ప్రథమార్థం అంతా చిరంజీవి, విజయశాంతి ప్రేమ, వారి కుటుంబాలు, ఊరిలో ప్రజల జీవన సరళిని చూపిస్తూ సాగుతుంది. వీరి జీవితాల్లో కనిపించే అనేక భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. కరీంనగర్ నేపథ్యంగా సినిమా సాగినా..ప్రతి పల్లె, ప్రతి రూరల్ ఏరియాను కథ, పాత్రలు ప్రతిబింబిస్తాయి. ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతంలోకి మల్టీ చైన్ బిజినెస్, చిట్టీల వ్యాపారం పేరుతో రావడంతో కథ మలుపు తిరుగుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో ఊరిలోని వారంతా డబ్బులు పెడతారు. కంపెనీ మోసం చేయడంతో ప్రజలంతా తీవ్రంగా నష్టపోతారు. ఇక్కడి నుంచి సెకండాఫ్ కు ఇంట్రెస్టింగ్ లీడ్ తీసుకున్నారు దర్శకుడు కుమారస్వామి. సెకండాఫ్ లో ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఒక ఆసక్తికర కథనాన్ని తెరపై ప్లే చేశాడు. ఈ ప్లే అంతా స్క్రీన్ మీద బాగా వర్కవుట్ అయ్యింది. హీరో సోషల్ మీడియాను వాడుకోవడం కూడా ఇవాల్టి ట్రెండ్ కు అద్దం పట్టేలా ఉంది. దర్శకుడు కుమార స్వామికి ఇది మొదటి సినిమా అయినా ఎంతో మెచ్యూర్డ్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రతి సీన్ లో ఆయన కథను ప్రేక్షకులకు నచ్చేలా చెప్పాలనే తపన కనిపించింది.

షరతులు వర్తిస్తాయి కథ ఎంత సహజమైందో అంతే సహజంగా నటించి ఆకట్టుకున్నారు మెయిన్ యాక్టర్స్ అంతా. చిరంజీవి పాత్రలో చైతన్య రావ్ తన కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా సెటిల్డ్ గా కనిపించాడు. ఆ పాత్రకు తగిన భావోద్వేగాలను పలికించాడు. అలాగే భూమి శెట్టి తెలుగులో తొలి సినిమా అయినా ఎక్సీపిరియన్స్ ఉన్న హీరోయిన్ లా మెప్పించింది. మిగతా కాస్టింగ్ అంతా ఈ కథలో అందంగా సెట్ అయ్యారు. టెక్నికల్ గా ఈ సినిమా బలంగా ఉంది. ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి సినిమాటోగ్రఫీ కరీంనగర్ లొకేషన్స్ ను బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసింది. అలాగే ప్రిన్స్ హెన్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అరుణ్ చిలువేరు ఇచ్చిన ట్యూన్స్ ఆకర్షణగా నిలుస్తాయి. సురేష్ బొబ్బిలి చేసిన పన్నెండు గుంజల పందిర్ల కింద పాట జోష్ తీసుకొచ్చేలా కంపోజ్ చేశారు. మధ్య తరగతి జీవితాల కథను, ఓ మంచి ఫ్యామిలీ ఎమోషన్ మూవీని చూడాలంటే షరతులు వర్తిస్తాయి బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు.

రేటింగ్ 3.5/5