నటీనటులు – విశ్వక్ సేన్, చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటర్:- రాఘవేంద్ర తిరున్, సంగీతం:- నరేష్ కుమారన్, సినిమాటోగ్రఫీ:- విశ్వనాథ్ రెడ్డి, నిర్మాత:- కార్తీక్ శబరీష్, దర్శకత్వం:- విద్యాధర్ కాగిత
ఈ మధ్య మంచి సినిమాల విషయంలో ఆడియెన్స్ ముందే ఊహించేస్తున్నారు. ఈ సినిమా బాగుంటుందని ముందే క్లారిటీకి వస్తున్నారు. ఈ క్రేజ్ ప్రీ బుకింగ్ సేల్స్ లో కనిపిస్తోంది. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ ఇలాగే ప్రీ రిలీజ్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ గామి కూడా అలాగే మంచి ఓపెనింగ్స్ రాబడుతోంది. ఇవాళ థియేటర్స్ లోకి వచ్చిన గామి థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా. అతనికి ఓ వింత జబ్బు ఉంటుంది. గతం మర్చిపోయిన శంకర్ మనిషి స్పర్శ తాకితే తట్టుకోలేకపోతాడు. ఇతడిని కేదారి బాబా అఘోరాల ఆశ్రమంలో చేర్పిస్తాడు. ఆ తర్వాత కేదారి బాబా వెళ్లిపోతాడు. శంకర్ వల్ల తమకు చెడ్డపేరు వస్తుందని అఘోరా ఆశ్రమం నుంచి బయటకు పంపిస్తారు. కేదారి బాబాను వెతుక్కుంటూ కుంభమేళాకు వెళ్తాడు శంకర్. అప్పటికే కేదారి బాబా చనిపోయి ఉంటాడు. అయితే బాబా శిష్యుడు శంకర్ జబ్బు పోగొట్టే మార్గం చెబుతాడు. హిమాలయాల్లో దొరికే మాల పత్రాలతో శంకర్ జబ్బు పోతుందని చెబుతాడు. ఆ మాల పత్రాల కోసం శంకర్ హిమాలయాలకు పయనమవుతాడు. ఆ పత్రాల కోసమే జాహ్నవి (చాందినీ చౌదరి) కూడా శంకర్ తో హిమాలయాలకు వెళ్తుంది. వీరికి మాల పత్రాలు దొరికాయా లేదా ఈ కథలో దేవదాసి దుర్గా (అభినయ), డాక్టర్ భక్షి పాత్రలు ఏంటి, ఈ మూడు క్యారెక్టర్స్ తో గామి కథకున్న లింకేంటి అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే
మూడు కథల ఆంథాలజీ ఇది. అయితే రెగ్యులర్ ఫార్మేట్ కమర్షియల్ సినిమాలకు మాత్రం గామి ఖచ్చితంగా భిన్నమైన సినిమా. ప్రయోగాత్మక కథా కథనాలతో దర్శకుడు విధ్యాధర్ కాగిత గామి సినిమాను ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా రూపొందించారు. శంకర్, దేవదాసి కూతురు, ఉమా, డాక్టర్ భక్షి తన ప్రయోగాల కోసం బంధించిన వ్యక్తి పాత్రల చుట్టూ సినిమా తొలి భాగం నడుస్తుంది. ద్వితీయార్థంలో మాత్రం శంకర్, జాహ్నవి మాల పత్రాలను హిమాలయాల్లో వెతికే ప్రయత్నాల ఓకవైపు, మరోవైపు దేవదాసీ పని నుంచి ఉమా, డాక్టర్ భక్షి నుంచి బంధింపబడిన వ్యక్తి తప్పించుకునేందుకు చేసే పనులతో ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది., సెకండాఫ్ లో ప్రతి సీన్ నెక్ట్ ఏం జరుగుతుందో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి.
అఘోరా శంకర్ క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ జీవించాడని చెప్పొచ్చు. యంగ్ హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ ఇలాంటి విభిన్నమైన క్యారెక్టర్ లో కనిపించడం, నటుడిగా అతనికి మంచి పేరు తీసుకొస్తుంది. జాహ్నవిగా చాందినీ చౌదరి ఆకట్టుకుంది. అలాగే దేవదాసిగా అభినయ, ఆమె కూతురు ఉమాగా చేసిన బాలనటితో పాటు మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రల మేరకు సహజంగా నటించారు. టెక్నికల్ గానూ గామి క్వాలిటీగా ఉంది. నరేష్ కుమారన్ మ్యూజిక్, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ గామికి ఆకర్షణగా నిలుస్తాయి. చివరగా తెలుగు సినిమా ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంటోంది. గామి కూడా అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.