నటీనటులు – సుహాస్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్,జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు
టెక్నికల్ టీమ్ – సంగీతం – శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్, ఎడిటింగ్ – కొదాటి పవన్ కల్యాణ్, బ్యానర్స్ – జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
రచన దర్శకత్వం – దుశ్యంత్ కటికినేని
కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన నటించిన కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో ఆడియెన్స్ ను ఎంతగా మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
అంబాజీపేట మ్యారేజి బ్యాండులో పనిచేస్తుంటాడు మల్లి (సుహాస్). అతని అక్క పద్మ (శరణ్య ప్రదీప్) టీచర్ గా వర్క్ చేస్తుంటుంది. ఊరి పెద్ద వెంకట్ బాబు (నితిన్) వల్లే పద్మకు టీచర్ జాబ్ వచ్చిందని, వారి మధ్య సంబంధం ఉందనే పుకారు ఊరిలో మొదలవుతుంది. వెంకట్ బాబు తమ్ముడికి మల్లికి గొడవ జరుగుతుంది. మరోవైపు మల్లి, వెంకట్ బాబు చెల్లి లక్ష్మి (శివాని నాగరం) ప్రేమించుకుంటారు. ఈ గొడవల నేపథ్యంలో మల్లి, లక్ష్మి ప్రేమ విషయం కూడా బయటకు వస్తుంది. ఒకరోజు రాత్రి స్కూల్ దగ్గరకు లక్ష్మిని పిలిచిన వెంకట్ బాబు ఊర్లో అందరి ముందు ఆమెను అవమానపరుస్తాడు. అక్కకు జరిగిన ఈ ఘటనపై మల్లి ఎలా రెస్పాండ్ అయ్యాడు. మల్లి, లక్ష్మి ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
ప్రేమ, ఆత్మాభిమానం, సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉండే అంతరాలు వంటి అంశాలతో దర్శకుడు దుశ్యంత్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను రూపొందించారు. మల్లి, లక్ష్మి మధ్య ప్రేమ సన్నివేశాలతో సరదాగా ఈ కథ ప్రారంభమవుతుంది. సహజమైన సన్నివేశాలు, పాత్రల చిత్రణ, అవి పలికే సంభాషణలు అన్నీ మనం ఆ ఊరికి వెళ్లి కొందరు మనుషుల మధ్య ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. అంత సహజంగా సినిమాను రూపొందించారు దర్శకుడు దుశ్యంత్. 2007 సంవత్సరంలో జరిగే కథ ఇది. ఆ టైమ్ లో సొసైటీ ఎలా ఉందో చూపించారు. అప్పుడే సెల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్వెల్ దాకా సరదాగా సాగే కథ. ఇంటర్వెల్ తర్వాత మరో మలుపు తీసుకుని ఎమోషనల్ గా మారుతుంది.
సెకండాఫ్ లో మల్లి, అతని అక్కడ పద్మ, ఇతర కుటుంబ సభ్యులతో సినిమా సాగుతుంది. ఆ కుటుంబంలో జరిగే సంఘర్షణ, డ్రామా ఆకట్టుకునేలా కుదిరింది. పోలీస్ స్టేషన్ లో సన్నివేశం ఆకట్టుకుంది. ప్రేమ మన ప్రాణాల మీదకు తీసుకురాకూడదనే లక్ష్మి చెప్పే మాట కన్విన్సింగ్ గా అనిపిస్తాయి. ఈ ఎమోషనల్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ హార్ట్ టచింగ్ గా ఉంది. అంబాజీపేట సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఒక కొత్త ప్రాంతంలోని ఒక కుటుంబం, కొన్ని పాత్రలను, వాటి మధ్య జరిగే కాన్ ఫ్లిక్ట్ ను బాగా ఫీలవుతారు.
మల్లి క్యారెక్టర్ లో సుహాస్ చూపించిన భావోద్వేగాలు ఈ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. అతనిలో ఇంత ఎమోషనల్ యాక్టర్ ఉన్నాడా అనిపిస్తుంది. శివానికి ఫస్ట్ మూవీ అయినా ఆమె సుహాస్ తో పోటీ పడింది. శరణ్య, నితిన్ యాక్టింగ్ వాళ్ల క్యారెక్టర్స్ కు పర్ ఫెక్ట్ గా కుదిరింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ వంటి టెక్నికల్ అంశాల్లో అంబాజీపేట మ్యారేజి బ్యాండు క్వాలిటీగా ఉంది. ఈ వారం ఒక నేటివ్ మూవీ ఎక్సీపిరియన్స్ చేయాలంటే అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీకి వెళ్లాల్సిందే.
రేటింగ్ 3.5/5