నటీనటులు – అవికా గోర్, నందు, అలీ రెజా, వీఎస్ రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్ తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – అనిల్ కుమార్, సినిమాటోగ్రఫీ – రామ్ కె మహేశ్, మ్యూజిక్ – శ్రీరామ్ మద్దూరి, ప్రొడ్యూసర్స్ – శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని , దర్శకత్వం – పోలూరు కృష్ణ
అవికా గోర్ అంటే ఇప్పటికీ చిన్నారి పెళ్లికూతురు నటిగానే ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ వంటి హిట్ మూవీస్ చేసింది అవికా. సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోనూ బిజీగా ఉందీ హీరోయిన్. అవికా చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్
“వధువు”. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ తో ఆకట్టుకున్న “వధువు” సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
ఇందు ( అవికా గోర్) పెళ్లి కాసేపట్లో జరుగబోతుండగా..ఆమె చెల్లెలు భాను పెళ్లి కొడుకుతో వెళ్లిపోతుంది. దీంతో ఇందు పెళ్లి ఆగిపోయి కుటుంబ సభ్యులు కుంగిపోతారు. ఈ ఘటన తర్వాత ఆనంద్ (నందు)తో ఇందు పెళ్లి కుదుర్చుతారు. పెళ్లై అత్తవారింట్లో అడుగుపెట్టిన ఇందుపై హత్యా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆమె మరిది ఆర్య (అలీ రెజా) భార్య వైష్ణవి మానసిక రుగ్మతతో బాధపడుతుంటుంది. నిన్నూ చంపేస్తారు పారిపో అంటూ ఇందును హెచ్చరిస్తుంటుంది. అత్తవారింట్లో జరుగుతున్న అనూహ్య ఘటనలకు, అత్తింటి కుటుంబ సభ్యుల అంతు చిక్కని ప్రవర్తనకు ఇందు కారణాలు కనుక్కునే పనిలో పడుతుంది. ఒక డిటెక్టివ్ లా రహస్యాల ఛేదనకు ప్రయత్నిస్తుంది. మరి ఈ పరిశోధనలో ఇందు సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
బెంగాళీ వెబ్ సిరీస్ ఇందును “వధువు”గా తెలుగులో రీమేక్ చేశారు దర్శకుడు పోలూరు కృష్ణ. ఒరిజినల్ లోని బెంగాళీ ఫ్లేవర్ మొత్తం తీసేసి తెలుగుదనం కనిపించేలా జాగ్రత్తపడ్డారు. మేకింగ్ లోని ప్రతి అంశంలో తెలుగు నేటివిటీ కనిపిస్తుంది. ఒక్కోటి 20 నిమిషాల నిడివి గల 7 ఎపిసోడ్స్ తో “వధువు” రూపొందించారు. మొదటి ఎపిసోడ్ లో ఇందు చెల్లెలు ఇందుకు కాబోయో భర్తను పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్లడంతో మొదలయ్యే ఇంట్రెస్ట్ చివరి ఎపిసోడ్ వరకు కొనసాగింది. ప్రతి ఎపిసోడ్ లో ఆ సస్పెన్స్ క్రియేట్ చేశారు దర్శకుడు కృష్ణ. అత్తవారింట్లో ఇందుకు ఎదురయ్యే ఘటనలు, అక్కడి మనుషుల్లో కనిపించే తేడా. అవేంటో తెలుసుకునేందుకు ఇందు చేసే ప్రయత్నాలు ఆసక్తి కలిగిస్తాయి. ఇందుగా అవికా బాగా నటించింది. ఆమె ఒక డిటెక్టివ్ కావొచ్చని అనుకుంటారు. మిగతా ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ బాగుంది. టెక్నికల్ గా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆకర్షణగా నిలుస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలనుకునేవారికి “వధువు” నచ్చుతుంది.