నటీనటులు: కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు.
టెక్నికల్ టీమ్: డీవోపీ: ఎస్. రవి వర్మన్, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్, నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, దర్శకత్వం: రాజుమురుగన్
కొత్తదనం ఉన్న సినిమాలు చేస్తుంటారు కోలీవుడ్ హీరో కార్తి. ఆయన సినిమాలన్నీ నేరుగా తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. కార్తి ఖైదీ, సర్దార్ ఇక్కడ కూడా మంచి హిట్ అయ్యాయి. దీపావళి సెంటిమెంట్ తో ఇవాళ తన కొత్త సినిమా జపాన్ తో థియేటర్స్ లోకి వచ్చారీ హీరో. జపాన్ ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
పేరున్న దొంగ జపాన్ (కార్తి). దొంగతనాలు చేస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అతని దొంగతనాలు ఆపడం పోలీసుల వల్ల కాదు. ఒక దొంగతనం సందర్భంలో పోలీసులకు సంబంధించిన వీడియో జపాన్ కు దొరుకుతుంది. అప్పటి నుంచి పోలీసులకు టార్గెట్ అవుతాడు జపాన్. పోలీస్ ఆఫీసర్స్ శ్రీధర్ (సునీల్), భవానీ (విజయ్ మిల్టన్) జపాన్ ను వెంటాడుతుంటారు. అతని కోసం ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా వెతుకుతుంటారు. ఈ క్రమంలో ఓ నగల దుకాణంలో 200 కోట్ల నగలు దోచుకుంటాడు జపాన్. ఈ భారీ దొంగతనం ఎవరు చేశారనే ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. పోలీసులు జపాన్ ను పట్టుకోగలిగారా, సినీ నటి సంజు (అనూ ఇమ్మాన్యూయేల్)తో జపాన్ కున్న రిలేషన్ ఏంటి అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
ఈ దొంగా పోలీస్ వేట కథలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అయితే వాటిని ఆసక్తికరంగా తెరకెక్కించి, ఆ దొంగ కథకో పర్పస్ ఉందని చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. జపాన్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాళ్లు విసరడం, 200 కోట్ల విలువైన నగలు కాజేయడం వంటి అంశాలు ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేశాయి. అతని పాత్రకు లక్ష్యమంటూ లేకుండా వ్యవహరించడమే ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. కథలోకి తీసుకెళ్లే ప్రారంభం సినిమాకు ఉన్నా..దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు దర్శకుడు. జపాన్ సినిమాలో వచ్చే చాలా అనవసర సన్నివేశాలు సినిమాలోని ఇంట్రెస్ట్ పోయేలా చేస్తాయి. ఫస్టాఫ్ కాస్త ఫర్వాలేదనిపించినా..సెకండాఫ్ మరీ డల్ గా మారింది.
నగల దోపిడీ కేసులో ఒక అమాయకుడు ఇరుక్కున్నాడని చూపిస్తూ ద్వితీయార్థం వరకు కథ సాగుతుంది. అయితే ఆ అమాయకుడు ఎవరన్నది రివీల్ చేసే పాయింట్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో అప్పటిదాకా కథకు వేసుకున్న త్రెడ్ పేలవంగా మారిపోతుంది. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి కథకు హెచ్ఐవీ వైరస్ గురించిన అంశాలు జోడించారు. ఇవి ఎమోషనల్ కంటెంట్ తీసుకొచ్చినా..కథకు అనవసరంగా అతికించినట్లు అనిపిస్తాయి. జపాన్ క్యారెక్టర్ లో కార్తీ నటన కొత్తగా ఉంది. అటు దొంగగా, ఇటు ప్లేబాయ్ తరహా మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అనూ ఇమ్మాన్యూయేల్ ఆటలో అరటిపండు లాంటి క్యారెక్టర్ చేసింది. సునీల్ పోలీస్ ఆఫీసర్ గా కీ రోల్ చేసి మెప్పించాడు. రవివర్మన్ విజువల్స్, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ సినిమాకు ఆకర్షణ అయ్యాయి. కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకునే క్రైమ్ కామెడీగా జపాన్ తయారైంది.