నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, తదితరులు
టెక్నికల్ టీమ్: సంగీతం – ఎస్ఎస్ థమన్, డీవోపీ – సంతోష్ డిటాకే, ఎడిటింగ్ – తమ్మిరాజు, ప్రెజెంట్స్ – జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, నిర్మాత -శ్రీనివాస చిట్టూరి, రచన, దర్శకత్వం – బోయపాటి శ్రీను
కథేంటంటే
రామకృష్ణరాజు (శ్రీకాంత్) మంచి పారిశ్రామికవేత్త. క్రౌన్ కంపెనీ ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తాడు. అలాంటి వ్యక్తిని ఏపీ సీఎం (అజయ్ పుర్కర్), తెలంగాణ సీఎం (శరత్ లోహితస్వ) చేయని నేరాలకు జైలు పాలు చేస్తారు. తెలంగాణ సీఎం కొడుకు ఏపీ సీఎం కూతురిని పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్లడంతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య శత్రుత్వం మొదలవుతుంది. ఏపీ సీఎం తన కూతురిని తిరిగి తీసుకొచ్చేందుకు స్కంధ అనే కుర్రాడిని (రామ్) దింపుతాడు. ఏదైనా సాధించగల సత్తా ఉన్న స్కంధ ఏపీ సీఎం కూతురితో పాటు తెలంగాణ సీఎం కూతురిని కూడా కిడ్నాప్ చేస్తాడు. వారిని రుద్రరాజపురం తీసుకెళ్తాడు. స్కంధ ఇలా ఎందుకు చేశాడు?. ఆ ఊరిలో ఎవరున్నారు?. స్కంధ తన తండ్రి మణికంఠ రాజు( దగ్గుబాటి రాజా)కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? లేదా అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
క్రౌన్ గ్రూప్ కంపెనీస్ ఓనర్ రామకృష్ణరాజు పాత్రతో మొదలయ్యే స్కంధ కథలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, వారి క్యారెక్టర్ లను పరిచయం చేస్తాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో ఎంటర్ అవుతాడు. హీరో హీరోయిన్స్ మధ్య సరదా సన్నివేశాలు గ్యాప్ ఫిల్లింగ్ కోసమైనా…యాక్షన్ సీన్స్ మొదలయ్యాక సినిమాలో సీరియస్ నెస్ పెరుగుతుంది. అయితే ఈ యాక్షన్ సీక్వెన్సులు అన్నీ లాజిక్ లేకుండా..హీరోకు అడ్డే లేదన్నట్లు వెళ్తుంటాయి. ఇద్దరు సీఎంల ఇంటికి వెళ్లి వాళ్ల కూతుర్లను హీరో తీసుకురావడం అంటే మాటలా..?ఎంత సెక్యూరిటీ ఉన్నా హీరో అలా వెళ్లి ఇలా వస్తుంటే..అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోతారు. స్కంధలో అఖండ కంటే ఎక్కువ క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. కథ ఆసక్తికరంగా మొదలైనా..మళ్లీ రొటీన్ సాగతీత సన్నివేశాలతో వెళ్తుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త బాగుండాల్సింది. తండ్రికి ఇచ్చిన మాట కోసం ఇద్దరు సీఎంలను స్కంధ ఎలా మట్టుబెట్టాడు అనేది రొటీన్ గా సాగే క్లైమాక్స్.
రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో రామ్ బాగా నటించాడు. తెలంగాణ, యాసతో పాటు సీమ యాసలో ఆకట్టుకున్నాడు. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో మెప్పించాడు. నటుడిగా రామ్ కు స్కంధ మరో మెట్టు తీసుకెళ్లే సినిమానే. రామ్ యాక్షన్ కు తగినట్లు గ్లామర్ మ్యాచ్ చేసింది శ్రీలీల. ఆమె అందం, డ్యాన్సులు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. స్కంధ తండ్రిగా దగ్గుబాటి రాజా, రామకృష్ణరాజుగా శ్రీకాంత్ పాత్రలకు తగినట్లు నటించారు. సయూ మంజ్రేకర్ సహా స్క్రీన్ నిండా చాలా క్యారెక్టర్స్ కనిపిస్తుంటాయి. తమన్ మ్యూజిక్ సో ..సో గా ఉంది. సినిమాటోగ్రఫీ సహా ఇతర క్రాప్ట్స్ బాగా పనిచేశాయి.
దర్శకుడిగా బోయపాటి మరోసారి యాక్షన్ నే నమ్ముకున్నాడు. ఆయన గత సినిమా అఖండలో కథ, పాత్రలు బాగా కుదరడంతో యాక్షన్ మెప్పించింది. స్కంధలో అది జరగలేదు. ఫోర్స్డ్ యాక్షన్, లాజిక్ లేని సన్నివేశాలతో యావరేజ్ మూవీ అనే ఫీల్ కలుగుతుంది. స్కంధ కథకు ఎక్కడో బెంగాల్ టైగర్ ఇన్సిపిరేషన్ ఉందనుకోవచ్చు.