కల్కి నుంచి లీక్స్ చేస్తే ఇక అంతే

స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898ఏడీ సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఈ సినిమా నుంచి ఇటీవల ప్రభాస్ స్టిల్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ స్టిల్ వైరల్ కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు మూవీ టీమ్. ఇవాళ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కల్కి సినిమా లీక్స్ గురించి హెచ్చరిక చేస్తూ నోటీసు రిలీజ్ చేసింది.

ఈ నోటీస్ లో కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్, ఫుటేజ్ అన్నింటికీ వైజయంతీ మూవీస్ కే హక్కు ఉందని, ఎవరైనా సోషల్ మీడియాలో ఈ సినిమా నుంచి లీక్స్ చేస్తే సైబర్ క్రైమ్ కింద కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది. ఇటీవల కల్కి సినిమాకు వీఎఫ్ఎక్స్ చేస్తున్న కంపెనీ నుంచి ప్రభాస్ స్టిల్ బయటకు వచ్చింది. దీంతో ఆ వీఎఫ్ఎక్స్ కంపెనీపై భారీ పెనాల్టీ చెల్లించాలంటూ కేసు వేసింది వైజయంతీ మూవీస్.

ఇప్పుడీ నోటీస్ తోనైనా లీక్స్ ఆగుతాయా చూడాలి. ప్రభాస్ హీరోగా దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో కల్కి 2898 ఏడీ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపిక, మనోజ్ బాజ్ పాయ్, కమల్ హాసన్ తదితర స్టార్ కాస్టింగ్ ఉన్నారు.