రివ్యూ – రామన్న యూత్

నటీనటులు : అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు.

సాంకేతిక నిపుణులు : ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్, ఆర్ట్ – లక్ష్మీ సింధూజ, సంగీతం – కమ్రాన్, సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్ కే, రచన దర్శకత్వం – అభయ్ నవీన్.

నేటివిటీ ఉన్న కథలు ఆదరణ పొందుతున్న ట్రెండ్ టాలీవుడ్ లో చూస్తున్నాం. ఒకప్పుడు తమిళ, మలయాళంలో వచ్చే ఇలాంటి లోకల్ కథలు ఇప్పుడు మన దగ్గరా ఆదరణ పొందుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినమా రామన్న యూత్. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.

కథేంటంటే
తెలంగాణలోని అంక్షాపూర్ అనే గ్రామం నేపథ్యంగా సాగే సినిమా ఇది. అక్కడి ఎమ్మెల్యే రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్) అంటే పిచ్చిగా అభిమానిస్తాడు రాజు (అభయ్ నవీన్). లోకల్ లీడర్ అనిల్ (తాగుబోతు రమేష్)తో కలిసి తిరుగుతుంటాడు. రాజుకు లైఫ్ లో యూత్ లీడర్ కావాలని కోరిక. స్నేహితులు చందు (జగన్ యోగిబాబు), రమేష్ (బన్నీ), బాలు (అనిల్ గీల)తో కలిసి ఊరిలో రామన్న యూత్ అసోసియేషన్ పెట్టుకుంటాడు. దసరా పండుగ రోజు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్ కట్టిస్తాడు. ఈ బ్యానర్ లో లోకల్ లీడర్ అనిల్ ( తాగుబోతు రమేష్) తమ్ముడు మహిపాల్ ఫొటో ఉండదు. దీంతో రాజ్ అండ్ బ్యాచ్ మీద కోపం పెంచుకుంటాడు మహిపాల్. తన అన్న అనిల్ హెల్ప్ లేకుండా ఎమ్మెల్యే దగ్గరకు ఎలా వెళ్తారో చూస్తానంటూ ఛాలెంజ్ చేస్తాడు. మహిపాల్ ఛాలెంజ్ తీసుకున్న రాజు, అతని స్నేహితులు ఎమ్మెల్యేను కలిశారా లేదా. ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి, రాజు తన ప్రేయసి స్వప్న (అమూల్య రెడ్డి)తో లవ్ సక్సెస్ చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

నటుడు అభయ్ నవీన్ ఒక మంచి పాయింట్ తో రామన్న యూత్ సినిమాను రూపొందించాడు. ఊరిలో ఒక లక్ష్యం అంటూ లేకుండా రాజకీయ నాయకులను నమ్మి వారి వెంట తిరిగే యువత జీవితాలు చివరకు ఎలా పాడవుతున్నాయో ఈ సినిమాలో సహజంగా తెరకెక్కించాడు. యువతను వాడుకునే వదిలేసే రాజకీయ నాయకుల నైజాన్ని చూపించాడు. ఈ సినిమా చూసిన యూత్ లో తప్పకుండా ఒక ఆలోచన మొదలవుతుంది. రామన్న యూత్ సినిమాను దర్శకుడిగా ప్రతిభావంతంగా తెరకెక్కించడమే కాదు రాజు క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించాడు అభయ్ నవీన్.

రామన్న యూత్ లో ప్రతి పాత్ర డిజైనింగ్ బాగుంది. సినిమా ఆద్యంతం ఎంతో నాచురల్ గా సాగుతుంది. తెలంగాణ పల్లె వాతావరణం, అక్కడి మనుషుల వ్యక్తిత్వాలు, అక్కడి నేటివిటీ మొత్తం అద్దంలా ప్రతిబింబిస్తుందీ సినిమా. రామన్న యూత్ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఎమోషన్ అన్నీ బ్యాలెన్స్ గా ఉండి మెప్పిస్తాయి. సినిమా చూస్తున్నంత సేపు మన ఊరి సంఘటనలు గుర్తొస్తాయి. ఎమ్మెల్యే రామన్న క్యారెక్టర్ లో శ్రీకాంత్ అయ్యంగార్ తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు. అనిల్ అన్న లాంటి క్యారెక్టర్ ను తాగుబోతు రమేష్ ఇప్పటిదాకా చేయలేదు. యాదమ్మ రాజు, జబర్దస్త్ రోహిణి తమ కామెడీతో నవ్వించారు. టెక్నికల్ గా ప్రతి డిపార్ట్ మెంట్ లో ఎఫర్ట్ కనిపించింది. మొత్తంగా రామన్న యూత్ తెలుగు తెరపై మరో మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.