ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెలుగులో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. గతంలో అల్లు అర్జున్ ను జవాన్ సినిమాలో ఓ కీ రోల్ కోసం అట్లీ సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. అట్లీ అల్లు అర్జున్ ను సంప్రదించిన మాట వాస్తవమేనని తెలిసింది. అయితే కారణాలు ఏవైనా జవాన్ లో అల్లు అర్జున్ నటించలేకపోయారు.
అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారట అట్లీ. ఈ దర్శకుడు అంటే అల్లు అర్జున్ కు ఇష్టమే. ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలేవీ ఫ్లాప్ కాలేదు. పైగా అన్నీ సూపర్ హిట్సే. అందుకే షారుఖ్ లాంటి బాలీవుడ్ స్టార్ అట్లీతో జవాన్ సినిమాను సొంత బ్యానర్ లో చేశారు. మరోవైపు అల్లు అర్జున్ నటనను ఇష్టపడే అట్లీ…ఆయనతో సినిమా చేయాలని నిర్ణయంతో ఉన్నారు.
హీరోలను ఎలివేషన్స్, మాస్ యాక్షన్ లో చూపించే అట్లీ…అల్లు అర్జున్ తో సినిమా చేస్తే అది తప్పకుండా పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని ఆకర్షించి, మరే క్రేజీ సినిమాకు తీసిపోనంత ఎక్స్ పెక్టేషన్స్ తెచ్చుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం అట్లీ తన జవాన్ సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తుంటగా..అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.