సౌత్ సినిమా ఇండస్ట్రీ ప్రభావం దేశవ్యాప్తంగా పెరుగుతోంది. పాన్ ఇండియా మూవీ ట్రెండ్ వచ్చేసిన తర్వాత దక్షిణాది హీరోలకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వ పదవులు దక్కడంలోనూ కనిపిస్తోంది. దేశంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు ట్రైనింగ్, అవకాశాలు, ఇతర సహకారాలు అందించే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థకు ప్రెసిడెంట్ గా ఇప్పటిదాకా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు నియామకం కాగా …ఇప్పుడు ఆ పదవి తమిళ హీరో మాధవన్ కు దక్కింది.
తాజాగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కు అధ్యక్షుడిగా ఆర్ మాధవన్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంస్థ కేంద్ర సమాచార ప్రసార శాఖ నిర్వహణలో పనిచేస్తుంటుంది. గతంలో ఈ సంస్థకు శ్యామ్ బెనగల్, అనుపమ్ ఖేర్ వంటి గొప్ప వారు అధ్యక్షులుగా పనిచేశారు.
ఇప్పుడు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ ఉండగా..వారిని కాదని ఆర్ మాధవన్ కు ఈ పదవి దక్కడం విశేషం. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇటీవల ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మాధవన్ నటించిన రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమా బెస్ట్ హిందీ మూవీగా నేషనల్ అవార్డ్ దక్కించుకుంది.