నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
టెక్నికల్ టీమ్: ఫైట్స్ : పీటర్ హెయిన్, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్, సి.ఇ.ఓ : చెర్రీ, సినిమాటోగ్రఫీ : జి.మురళి, నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.
ప్లెజంట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు తెచ్చుకుంది విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. ఇవాళ తెరపైకి వచ్చిన ఖుషి అంచనాల మేరకు ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
బీఎస్ఎన్ఎల్ సంస్థలో ఉద్యోగిగా పనిచేసే విప్లవ్ (విజయ్ దేవరకొండ) దర్శకుడు మణిరత్నం సినిమాలకు పెద్ద అభిమాని. మణిరత్నం సినిమాల్లో చూపించినట్లే మంచుతో నిండిన కొండలు చూస్తూ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వినాలనుకుంటాడు. ఆ ఫాంటసీతో కాశ్మీర్ లో పోస్టింగ్ తీసుకుంటాడు. బేగం (సమంత)ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ప్రేమలో పడతాడు విప్లవ్. బ్రాహ్మిణ్ అయిన ఆరాధ్య కొన్ని పరిస్థితుల్లో బేగంగా మారాల్సివస్తుంది. వారి మధ్య కాసేపు ప్రేమ కథ సరదాగా సాగుతుంది. విప్లవ్ ప్రేమను ఆరాధ్య ఒప్పుకుంటుంది. మరోవైపు ఆరాధ్య తండ్రి శ్రీనివాసరావు (మురళీ శర్మ) దేవుడి మీద భక్తి, జాతకాల్లో నమ్మకాలు గలవాడు. ఈ విషయాల్లో అతను పట్టుదలగా ఉంటాడు. విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖేడ్ కర్) నాస్తికుడు. ఎలాంటి నమ్మకాలు, మూఢ నమ్మకాలు లేని వ్యక్తి. ఇలాంటి రెండు పరస్పరం భిన్నమైన కుటుంబాలు విప్లవ్, ఆరాధ్య ప్రేమ పెళ్లికి నో చెబుతారు. దాంతో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు విప్లవ్, ఆరాధ్య. ఆ తర్వాత వారి మ్యారేజ్ లైఫ్ లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
కుటుంబ నేపథ్యాలతో కలిసిన ప్రేమ కథకు ఉండాల్సిన అన్ని అంశాలను చేర్చి ఖుషి సినిమాను రూపొందించాడు దర్శకుడు శివ నిర్వాణ. ఫస్ట్ హాఫ్ లో కాశ్మీర్ వంటి అందమైన బ్యాక్ డ్రాప్ లో సాగే ఫన్ లవ్ స్టోరి ఆకట్టుకోగా…ద్వితీయార్థంలో ఫ్యామిలీ ఎమోషన్స్ మెప్పిస్తాయి. రెండు భిన్నమైన నేపథ్యాలున్న కుటుంబాల మధ్య తమ ప్రేమను ఒప్పించుకునేందుకు విప్లవ్, ఆరాధ్య పడే ఇబ్బందులు ఫన్ గా ఉంటూనే ఎమోషన్ తీసుకొచ్చాయి. ఇక ఈ ప్రేమ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక వారి మధ్య వచ్చే చిన్న చిన్న ఈగోలు, మనస్పర్థలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది చాలా సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు శివ నిర్వాణ.
విప్లవ్ గా విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఖుషికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు విజయ్. లవ్ మేకింగ్ సీన్స్, రొమాన్స్, ఎమోషనల్ సీన్స్ ..ఇలా కథలోని ప్రధాన ఘట్టాల్లో విజయ్ నటన మెప్పిస్తుంది. విజయ్ తో పోటీ పడుతూ సమంత ఆరాధ్యగా ఆకట్టుకుంది. ఇలాంటి క్యారెక్టర్స్ సమంత ఎంతో ఈజ్ తో చేయగలదు. ఖుషిలోనూ ఆ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. నాస్తికుడైన తండ్రిగా సచిన్ ఖేడ్ కర్, పంచాగాలను నమ్మే బ్రాహ్మిణ్ గా మురళీ శర్మ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వెన్నెల కిషోర్ సినిమా ఫస్ట్ హాఫ్ లో విజయ్ తో కలిసి నవ్విస్తే..సెకండాఫ్ లో ఆ బాధ్యత రాహుల్ రామకృష్ణ తీసుకున్నాడు. జయరాం, రోహిణి సబ్ స్టోరి ఎంతో ఎమోషనల్ గా అనిపించింది. ఇక సినిమా చివరి 30 నిమిషాలు మనసుకు హత్తుకుంటుంది. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి.
టెక్నికల్ గా ఖుషి స్ట్రాంగ్ మూవీ అని చెప్పుకోవాలి. జి.మురళి సినిమాటోగ్రఫీ కథను ఎంతో అందంగా తెరపై చూపించింది. కాశ్మీర్ బ్యూటీని తన కెమెరాలో బంధించాడు మురళి. హేషమ్ సంగీతం ఎంత ఛాట్ బస్టర్ అయ్యిందో రిలీజ్ ముందే చూశాం. సినిమాలో నా రోజా నువ్వే, ఆరాధ్య లాంటి పాటలు విజువల్ ఫీస్ట్ గా మారాయి. మైత్రీ సంస్థ రాజీలేని ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చాయి. తెలుగు తెరపై ఈ మధ్య యాక్షన్, రగ్డ్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి ట్రెండ్ లో ఖుషి వంటి బ్రీజీ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను అలరిస్తోంది.
చివరగా..”ఖుషి” ప్రేక్షకుల మనసుల్ని ఖుషి చేస్తుంది
రేటింగ్ 3.5/5