కొత్త ప్రాజెక్ట్స్ కు నో చెబుతున్న పవన్

పవన్ కల్యాణ్ ఇక రాజకీయంగానే ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాల నుంచి మళ్లీ ఆయన పెద్ద బ్రేక్ తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఏపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో తన రాజకీయ పార్టీ జనసేనను ప్రజల దగ్గరకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని పవన్ భావిస్తున్నారట. ఈలోగా తనకున్న ప్రాజెక్ట్స్ లో పూర్తి చేయగలిగినవి ఫినిష్ చేయాలనుకుంటున్నారు పవన్.

పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరి హర వీరమల్లు, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ చిత్రాలున్నాయి. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. హరి హర వీరమల్లును హోల్డ్ లో పెట్టారు. ఉస్తాద్ షూటింగ్ లో ప్రస్తుతం పవన్ ఉన్నారు. వచ్చే వారం నుంచి ఓజీ షూటింగ్ కోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారు. ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేసి హరి హర వీరమల్లు విషయం మాత్రం ఏపీ ఎలక్షన్స్ తర్వాతే ఆలోచించాలని పవన్ భావిస్తున్నారట.

ఈలోగా కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కమిట్ కావడం లేదు పవన్. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలనే కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇవి పూర్తి చేసి వారాహి యాత్రతో ఏపీ ప్రజల ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పార్టీ పరంగా మరింత బలం పుంజుకోవాలని పవన్ నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.