సినిమాల నుంచి తప్పుకుంటా…ఇదే నా చివరి సినిమా…ఇలాంటి మాటలు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గత ఎంతోకాలంగా చెబుతూ వస్తున్నాడు. అప్పుడెప్పుడో చంద్రముఖి టైమ్ నుంచి ఆయన ఈ మాట అంటూనే ఉన్నాడు. సినిమాల నుంచి గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాటలో నడవాలన్నది రజనీ కోరిక కావొచ్చు. మధ్యలో రాజకీయ పార్టీ స్టార్ట్ చేసి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు. జైలర్ సక్సెస్ తో రజనీ సినిమాల్లో నటించడం ఇక ఆపాలనుకున్నా ఆపలేడని అర్థమవుతోంది.
పదేళ్లుగా హిట్ సినిమా లేకున్నా..రజనీ ఫీజులోనూ, సినిమాల ఆఫర్స్ లోనూ తేడా కనిపించలేదు. ఇక ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ వచ్చాక తగ్గుతుందా. మరిన్ని సినిమాలు ఆయనను వెతుక్కుంటూ వస్తాయి. జైలర్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి.
జైలర్ థియేటర్ లో ఉండగానే..ఇప్పుడు తన కొత్త సినిమా (రజనీ 170) మొదలుపెట్టాడు రజనీ. జై భీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, శర్వానంద్ నటించనున్నారు. వచ్చే నెల నుంచి రజనీ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.