ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం పుష్ప. ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చింది. అందరి అంచనాలను తారుమారు చేసింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాదు.. ఇప్పుడు జాతీయ అవార్డులోనూ సత్తా చూపించింది. ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకుని చరిత్ర సృష్టించాడు. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకోలేదు.
అరుదైన ఆ అవార్డ్ ను.. అల్లు అర్జున్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. అన్నమయ్య చిత్రానికి గాను కింగ్ నాగార్జున జాతీయ ఉత్తమ నటుడుగా స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. ఆ సంవత్సరంలో ఉత్తమ నటుడుగా నాగార్జున అందుకోవాల్సింది కానీ.. మిస్ అయ్యింది. స్పెషల్ జ్యూరీ అవార్డ్ వచ్చింది. ఆతర్వాత ఏ తెలుగు హీరో స్పెషల్ జ్యూరీ అవార్డ్ కూడా అందుకోలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అవార్డ్ దక్కించుకుని తన పేరును సువర్ణాక్షరాలతో రాసాడని చెప్పచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అవార్డులు గెలుచుకుంది. అయితే.. ఉత్తమ నటుడుగా అవార్డ్ దక్కించుకోవడం బన్నీ రేంజ్ మరింత పెరిగిందని చెప్పచ్చు.