సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పాదాభివందనం చేయడంపై గత రెండు రోజులుగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. తనకన్నా వయసులో చిన్న వాడైన యోగికి రజనీ పాదాభివందనం చేయడం ఏంటని విమర్శలు చెలరేగాయి. తన కొత్త సినిమా జైలర్ సూపర్ హిట్టయిన సందర్భంగా నార్త్ ఇండియాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు రజనీకాంత్. హిమాలయాలకు కూడా వెళ్లొచ్చారు. ఈ పర్యటనలో భాగంగానే యూపీ వెళ్లి సీఎం యోగిని కలిశారు. నార్త్ ఇండియా టూర్ ముగించుకుని చెన్నై చేరుకున్న రజనీ ఈ ట్రోల్స్ పై స్పందించారు.
రజనీకాంత్ స్పందిస్తూ – యోగులు లేదా స్వాములకు పాదాభివందనం నాకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ వ్యక్తి నాకంటే వయసులో చిన్న వాడా పెద్దవాడా లేక హోదాలో చిన్న వాడా పెద్ద వాడా అనేది నేనూ చూడను. యోగులు, స్వాములను ఎప్పుడు కలిసినా పాదాభివందనం చేస్తా అని పేర్కొన్నారు. రజనీ ఇచ్చిన సమాధానంతో ఈ విమర్శలకు పుల్ స్టాప్ పడినట్లే అనుకోవాలి.
ఇక ఆయన నటించిన రీసెంట్ మూవీ జైలర్ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. దాదాపు 500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ సినిమా రజనీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది. జైలర్ సక్సెస్ చేసిన అభిమానులు, ప్రేక్షకులకు రజనీ థాంక్స్ చెప్పారు.