ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇంతకీ పవన్ ఏమన్నారంటే.. అన్నయ్య చిరంజీవికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను అన్నారు. ఒక సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లుగా మీ ప్రయాణం నాకు గోచరిస్తోంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకుండా లక్షలాది మందికి స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవాభావం నా వంటి ఎందరికో ఆదర్శం అన్నారు.
కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా… కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తోన్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan@KChiruTweets#HBDMegastarChiranjeevi pic.twitter.com/ERu1BHiifr
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2023