9 రోజుల్లో 100 కోట్ల వసూళ్లు..మళ్లీ ఫామ్ లోకి అక్షయ్

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఓ మై గాడ్ 2 సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ చేరుకుంది. రిలీజైన 9 రోజుల్లో ఈ సినిమా హండ్రెడ్ క్రోర్ ఫీట్ సాధించింది. ఓ మై గాడ్ 2 సినిమాకు సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమా గట్టి పోటీ ఇచ్చింది. లేకుంటే అక్షయ్ సినిమా మరిన్ని వసూళ్లు సాధించేవి. బాలీవుడ్ కు ఈ ఏడాది మరో హిట్ సినిమా ఇచ్చింది ఓ మై గాడ్ 2 మూవీ.

గత కొద్ది కాలంగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు అక్షయ్ కుమార్. ఆయన నటించిన బెల్ బాటమ్, లక్ష్మీ బాంబ్, సామ్రాట్ పృథ్వీరాజ్ వంటి అరడజను సినిమాల దాకా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా మారాయి. ఇలాంటి సందర్భంలో అక్షయ్ ను మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చింది ఓ మై గాడ్ 2 సినిమా. అక్షయ్ కెరీర్ లో వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాల్లో ఓ మై గాడ్ 2 16వ చిత్రం కావడం విశేషం.

సెక్స్ ఎడ్యుకేషన్ గురించి నిర్భయంగా చర్చించిన సినిమాగా ఈ చిత్రానికి పేరొచ్చింది. దర్శకుడు అమిత్ రాయ్ రూపొందించిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠీ, యామీ గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. నెక్ట్ వీక్ ఆయుశ్మాన్ ఖురానా, అనన్య పాండే జంటగా నటించిన డ్రీమ్ గర్ల్ 2 సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి బాక్సాఫీస్ వద్ద ఓ మై గాడ్ 2 సినిమా ఫ్యూచర్ నెంబర్స్ అంచనా వేయొచ్చని అంటున్నాయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు.