రివ్యూ – ఉస్తాద్

నటీనటులు : శ్రీసింహా కోడూరి, కావ్య క‌ళ్యాణ్ రామ్‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అను హాస‌న్‌, ర‌వీంద్ర విజ‌య్‌ తదిత‌రులు

సాంకేతిక వ‌ర్గం : సినిమాటోగ్ర‌ఫీ – ప‌వ‌న్ కుమార్ పప్పుల, మ్యూజిక్‌ – అకీవా.బి
ఎడిట‌ర్‌ – కార్తీక్ క‌ట్స్‌, నిర్మాత‌లు – ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం – ఫ‌ణిదీప్‌

రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు యువ హీరో శ్రీ సింహా కోడూరి. ఆయన నటించిన కొత్త సినిమా ఉస్తాద్ థియేటర్స్ లోకి వచ్చేసింది. ఆల్రెడీ రెండు పెద్ద సినిమాలు భోళా శంకర్, జైలర్ థియేటర్స్ లో ఉండగానే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం

కథేంటంటే
మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు సూర్య (శ్రీసింహా). చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సూర్యను అన్నీ తానై పెంచుతుంది తల్లి. సూర్యకు ఎత్తైన ప్రదేశాలంటే భయం. డిగ్రీ పూర్తి చేసినా..జీవితం ఎలా ఉండాలనే స్పష్టమైన లక్ష్యాలేవీ పెట్టుకోడు. అతనికి ఒక బైక్ ఉంటుంది. దాని పేరు ఉస్తాద్. ఇదే తన లక్కీ ఛార్మ్ అని నమ్ముతుంటాడు సూర్య. మేఘన (కావ్య కల్యాణ్)ను ప్రేమించిన తర్వాత పైలట్ అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటాడు సూర్య. ఎత్తైన ప్రదేశాలంటే భయపడే సూర్య పైలట్ అయ్యేందుకు ఎలాంటి మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే
మనం తరుచూ చూసే ఓ మధ్య తరగతి యువకుడి కథే ఈ సినిమా. అతని చదువు, బైక్ తో హీరోకున్న అటాచ్ మెంట్, నచ్చిన అమ్మాయితో అతను సాగించిన ప్రేమాయణం. మానసిక సంఘర్షణ ఎదుర్కొంటూ పైలట్ అయ్యేందుకు పడే కష్టం. ఇలాంటి అంశాలను చూపిస్తూ కథను తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు ఫణిదీప్. ఈ క్రమంలో ఒక యువకుడి బయోగ్రఫీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వీటిని బైక్ తో ముడిపెట్టడంతో కథలో ఒక ఎమోషన్ క్రియేట్ అయ్యింది. అయితే అసలు కథను టేకాఫ్ చేయడంలో దర్శకుడు కావాల్సినంత సమయం తీసుకోవడమే ఈ సినిమాకు శాపంగా మారింది.

ఒక ఫ్లోలో స్పీడ్ గా కథలను తెరకెక్కిస్తున్న రోజులివి. షార్ప్ ఎడిటింగ్ సక్సెస్ ఫార్ములాగా మారుతోంది. దశలు దశలుగా హీరో జీవితాన్ని చూపిస్తూ సాగిన స్లో స్క్రీన్ ప్లే ఉస్తాద్ ఢీలా పడింది. మేఘనతో సూర్య ప్రేమలో పడినప్పటి నుంచి ఊపందుకున్న కథనం…క్లైమాక్స్ వరకు బాగానే కొనసాగుతుంది. సూర్య పైలట్ గా మారిన తీరు ఇన్స్ పైరింగ్ గా ఉంది. సూర్య పాత్రలో శ్రీ సింహా తన సహజమైన నటన చూపించాడు. చాలా రకాల ఎమోషన్స్ అతను పలికించగలిగాడు. కావ్య కల్యాణ్ రామ్ కు మంచి క్యారెక్టర్ దొరికింది. తన క్యారెక్టర్ కథలో కీలకంగా ఉంటుంది. పైలట్ జోసెఫ్ డిసౌజా పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, మెకానిక్ బ్రహ్మంగా రవీంద్ర విజయ్ మెప్పించారు. టెక్నికల్ గా చూస్తే..అకీవా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.