రివ్యూ – భోళా శంకర్

నటీనటులు – చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, తరుణ్ అరోరా, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష

సాంకేతిక విభాగం : సంగీతం: మహతి స్వర సాగర్, డీవోపీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, డైలాగ్స్: తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్

ఈ సీజన్ లో వచ్చిన క్రేజీ మూవీ భోళా శంకర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కాబట్టి మాస్ లో ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఏర్పడ్డాయి. అయితే దర్శకుడు మెహర్ రమేష్ మీదే అందరి డౌట్స్. ఈ డౌట్స్ మధ్య సినిమా మీద పెట్టుకున్న అంచనాలను భోళా.. రీచ్ అయ్యిందా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

కలకత్తాలో ఉండే టాక్సీ డ్రైవర్ శంకర్(చిరంజీవి)కి చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్) అంటే ప్రాణం. ఆమెను చదివిస్తూ తను ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. మహాలక్ష్మి క్యూట్ నెస్ చూసి ప్రేమలో పడిపోతాడు శ్రీకర్ (సుశాంత్). పెద్దలు వీళ్లకు పెళ్లి చేయాలనుకుంటారు. శంకర్ తన చెల్లి పెళ్లి ప్రయత్నాల్లో ఉంటూనే మరోవైపు హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమ రవాణా)కు పాల్పడే అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) సోదరులను ఒక్కొక్కరిగా చంపుతుంటాడు. ఈ విషయాన్ని చూస్తుంది శ్రీకర్ సోదరి, క్రిమనల్ లాయర్ లాస్య (తమన్నా). ఆ తర్వాత ఏమైంది. శ్రీకర్, మహాలక్ష్మి పెళ్లి జరిగిందా. అసలీ ముఠాకు శంకర్ కు ఉన్న వైరం ఏంటి, శంకర్ ప్లాష్ బ్యాక్ ఏంటనేది తెరపై చూడాల్సిన మిగిలిన కథ.

ఎలా ఉందంటే

ఇటీవల కాలంలో చిరంజీవి చేసిన మరో రీమేక్ సినిమా ఇది. ఎనిమిదేళ్ల కిందట అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను ఇంత కాలం తర్వాత తెలుగులోకి తీసుకొచ్చారు. ఆ సినిమాను మనోళ్లు పెద్దగా చూసి ఉండరు. అలాగే ఓటీటీలోనూ లేదు కాబట్టి ప్రేక్షకులకు కొత్తగానే ఉంటుందని ప్రెస్ మీట్స్ లో చిరంజీవి చెప్పారు. పోనీ కొత్తగానే ఈ కథను యాక్సెప్ట్ చేద్దామన్నా ఆ కొత్తదనం ఏమైనా సినిమాలో ఉండాలిగా..

తొలిభాగం సినిమాలో ట్యాక్సీ డ్రైవర్ గా మెగాస్టార్ తనదైన శైలి సరదా నటనను, సెకండాఫ్ లో భోళా అనే గ్యాంగ్ స్టర్ గా యాక్షన్ నూ పంచారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. సెకండాఫ్ లో చిరు చేసిన కొన్ని సీన్స్ మెరుపులు మెరిపిస్తాయి. అయితే అప్పటికే ప్రేక్షకులు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. స్టార్ కాస్టింగ్ లో చిరు సోదరి మహాలక్ష్మి పాత్రలో కీర్తి తను చేయగలిగినంత మంచి యాక్టింగ్ చేసింది. లాయర్ లాస్యగా తమన్నా పాటలకే పరిమితం అయ్యింది. కథలో ఆమె చేయాల్సింది పెద్దగా ఇంకేం లేదు.

తరుణ్ అరోరా విలనీలో బోర్ కొట్టే డబ్బింగ్ మరీ విసిగించింది. చిరంజీవి పవన్ ను ఇమిటేట్ చేయడం ఓకే గానీ శ్రీముఖితో ఖుషి నడుము సీన్స్ చేయడం జబర్దస్త్ లా కూడా నవ్వించలేదు. వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వైవా హర్ష వంటి గ్యాంగ్ చేసే కామెడీలో కూడా పసలేదు. ఇలాంటి కథల్ని వేదాళం రీమేక్ అని చెప్పుకోవడం, దానికి 70శాతం మార్పులు చేశామని అనడం కూడా వృథానే. స్వయంగా చిరంజీవే ఇలాంటివి ఎన్ని సినిమాలు చేసి ఉంటారు.

కావాల్సినంత కామెడీ, గ్యాంగ్ స్టర్ యాక్షన్, మంచి పాటలు, చెల్లి సెంటిమెంట్..ఇవన్నీ ఓ సూపర్ హిట్ సినిమా కావాల్సిన సరుకులే. కానీ వాటిని వాడుకునే విధానమే దర్శకుడు మెహర్ రమేష్ కు రాలేదు. ఆయన పేరు చూస్తేనే సందేహించే ప్రేక్షకుల ఈ విషయంలో పడిన భయం కూడా నిజమైంది. ఆయనకు కమ్ బ్యాక్ లాంటి ఇంత మంచి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సినిమాటోగ్రఫీ బాగున్నా, పాటల్లో ఒక్కటీ ఆకట్టుకోలేదు. విజువల్ గా పాటల మేకింగ్ బ్యుటిఫుల్ గా, గ్రాండ్ గా ఉంది.