ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన యంగ్ హీరో కార్తికేయ. ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సరైన సక్సెస్ రాలేదు. తొలి సినిమాతో వచ్చిన సక్సెస్ ను ఎలా నిలబెట్టుకోవాలో తెలియక కెరీర్ లో వెనకబడ్డాడు. ఇప్పుడు బెదురులంక 2012 అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. వాయిదాల మీద వాయిదాలు పడి ఆఖరికి ఆగష్ట్ 25న థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా పై కార్తికేయ చాలా ఆశలు పెట్టుకున్నారు.
బెదురులంకలో కార్తికేయకు జంటగా నేహా శెట్టి నటించింది. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించాడు. ఇది రెగ్యులర్ సినిమా కాదు.. యుగాంతం అనే కాన్సెప్ట్ తో రూపొందిన విలేజ్ డ్రామా. ఇంకా చెప్పాలంటే.. అందమైన గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో కడుపుబ్బా నవ్విస్తూనే ఆలోచింప చేసే కథే బెదురులంక 2012. అప్పట్లో యుగాంతం అవుతుందనే వార్తని లక్షల మంది నమ్మారు. అలా నమ్మిన ఒక ఊరి ప్రజలకి చివరికి ఏమైంది? అనే కథనం ఆసక్తి రేపుతుంది. మొదటి చిత్రమైనా కూడా క్లాక్స్ అద్భుతంగా తీశారని హీరో చెబుతున్నాడు. తన పాత్ర కామెడీ టైమింగ్, ఎమోషనల్ గ్రాఫ్ చాలా బాగా తీసుకెళ్లారు అని అన్నారు హీరో కార్తికేయ. ఇది కార్తికేయకు ఒక రకంగా ప్రయోగమే. మరి.. ఈ ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి.