‘బ్రో’ను అంటే ఊరుకుంటాడా – ఏపీ ప్రభుత్వానికి మెగాస్టార్ చురకలు

సినిమా ఇండస్ట్రీ మీద మీ ప్రతాపం చూపించడం మాని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల తన సోదరుడు పవన్ బ్రో సినిమా విషయంలో ఏపీ మంత్రులు కొందరు విమర్శలు చేసిన నేపథ్యంలో చిరంజీవి గట్టిగానే స్పందించారు. ప్రజలకు ఉపయోగపడే పనుల మీద దృష్టి పెట్టాలంటూ చురకలు అంటించారు.

వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా తెలుగు సినిమా పరిశ్రమ మీద పంతానికి పోతున్నారని, ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉండగా..సినిమాలను, సినిమా వాళ్లను విమర్శించడం తగదని చిరంజీవి అన్నారు. ప్రత్యేక హోదా, ఉద్యోగాల కల్పన, రోడ్లు..ఇలా అనేక అంశాల్లో మంత్రులు, ఏపీ ప్రభుత్వం పనిచేయాలని చిరంజీవి సూచించారు. అవన్నీ వదిలేసి సినిమా ఇండస్ట్రీని కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు.