బెన్ ఫిట్ షోస్, టికెట్ రేట్ల పెంపు లేనట్లే

సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని, టాలీవుడ్ లోని సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సినీ ప్రముఖులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సీ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, రాఘవేంద్రరావు, కిరణ్ అబ్బవరం, తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తిపై కమిటీ వేస్తామని, ముందస్తు అనుమతులు, తగిన సెక్యూరిటీ ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామని సీఎం టాలీవుడ్ ప్రముఖులకు స్పష్టం చేశారు.

అనంతరం దిల్ రాజు స్పందిస్తూ – దేశవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి పెరిగింది. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఈ భేటీలో నిర్ణయించాం. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు. సామాజిక కార్యక్రమాల్లో ఇండస్ట్రీ భాగస్వామ్యం ఉండాలని వారు చెప్పారు. డ్రగ్స్, గంజాయిపై పోరాటంలో ఇకపై మన హీరోలు విస్తృతంగా పాల్గొంటారని మాటిచ్చాం. కొన్ని ఘటనల వల్ల ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. అన్నారు.