రివ్యూ – ఫియర్

నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు

టెక్నికల్ టీమ్ – మ్యూజిక్ – అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ, నిర్మాత – డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి, కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి, రచన, ఎడిటింగ్, దర్శకత్వం – డా. హరిత గోగినేని

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా ఫియర్. వేదిక లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మరెన్నో హైలైట్స్ తో థియేటర్స్ లోకి ఈ నెల 14న రాబోతోంది ఫియర్. అయితే ప్రీమియర్స్ గురువారం నుంచే ప్రారంభమయ్యాయి. ఫియర్ సినిమా ఎంతగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

సింధు (వేదిక), ఇందు (వేదిక) కవల పిల్లలు. సింధును చిన్నప్పటి నుంచి కొన్ని భయాలు వెంటాడుతుంటాయి. ఇందుకు అలాంటి భయాలేవీ ఉండవు. సింధు పిచ్చిది అన్నట్లు తక్కువ చేసి మాట్లాడుతుంటుంది ఇందు. అక్కంటే ఎంతో ప్రేమ ఉన్న సింధు ఆమె తనను తిడుతుంటే బాధపడుతుంటుంది. సింధుకు తన క్లాస్ లో సంపత్(అరవింద్ కృష్ణ) పరిచయం అవుతాడు. వారితో పాటే వారి స్నేహం కూడా పెరిగి ప్రేమించుకుంటారు. సంపత్ తనతో మాత్రమే మాట్లాడాలని, తనకే సొంతం కావాలనేది సింధు కోరిక. తన కవల సోదరి ఇందు (వేదిక) సంపత్ తో మాట్లాడినా ఒప్పుకోదు. మరోవైపు సింధు ఎవరో బూచోడు వెంటపడినట్లు, చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు భయపడుతుంటుంది. పేరెంట్స్ సింధును ఒక పీస్ మెంటల్ అసైలమ్ (మానసిక చికిత్సాలయం)లో చేర్పిస్తారు. అక్కడే ఆమె చికిత్స తీసుకుంటూ ఉంటుంది. అక్కడి వైద్యులను, సిబ్బందిని సింధు అడిగే ప్రశ్న సంపత్ (అరవింద్ కృష్ణ) ఎక్కడ, సంపత్ కావాలి. ఆఫీస్ వర్క్ మీద మరో ఊరికి వెళ్లిన సంపత్ ఎంతకీ తిరిగిరాడు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంటుంది. సంపత్ ఎందుకు కనిపించకుండా పోయాడు, సోదరి ఇందుతో సింధు ఎందుకు గొడవ పడింది, సింధును వెంటాడుతున్న ఆ బూచోడు ఎవరు..ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే

హీరోయిన్ జ్ఞాపకాలను రీకాల్ చేస్తూ ఇన్నోవేటివ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఫియర్ సినిమా ఆద్యంతం సాగుతుంటుంది. ఆస్పత్రిలో వేదిక క్యారెక్టర్ ను పరిచయం చేసి..అక్కడి నుంచి ఒక్కో సీన్ తో ఆమె వర్తమానానికి, గతానికి ముడిపెడుతూ ఆసక్తికరంగా సినిమాను రూపొందించారు దర్శకురాలు డా.హరిత గోగినేని. ఒకవైపు వేదికను అందంగా చూపిస్తూనే, ఆమె పాత్రలోని సంఘర్షణను తెరపై ఆవిష్కిరించారు హరిత. పిల్లల భౌతిక, మానసిక పరిస్థితులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలనే ఒక మంచి సందేశాన్ని కూడా ఫియర్ మూవీ ద్వారా అందించారు.

సినిమా ప్రారంభం నుంచే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కలిసిన ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ఇప్పుడేం జరుగుతుందా అనే క్యూరియాసిటీని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా సస్టెయిన్ చేస్తూ వెళ్లారు దర్శకురాలు. ఆమెకు ఇది ఫస్ట్ సినిమా అంటే ఎవరూ నమ్మరు. ఎంతో మెచ్యూర్డ్ గా షాట్ మేకింగ్స్ ఉన్నాయి. వేదిక పాత్రను ఆస్పత్రి నుంచి ఫ్లాష్ బ్యాక్ కు తీసుకెళ్తూ సినిమాను ప్రారంభించడంతో సినిమా ప్రారంభం నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలైట్. అక్కడే అసలు కథను రివీల్ చేశారు డైరెక్టర్ హరిత. పాత్ బ్రేకింగ్ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ సినిమాతోనే తన ప్రతిభ చూపించారీ లేడీ డైరెక్టర్.

రెండు పాత్రల్లో వేదిక నటన అద్భుతంగా ఉంది. ఆమె సింధు, ఇందు క్యారెక్టర్స్ కు లైఫ్ ఇచ్చింది. ఆమెను సెలెక్ట్ చేసుకోవడం ఈ కథకు పర్పెక్ట్ అనిపిస్తుంది. హ్యాపీ, సాడ్, గ్లామర్..ఇలా ప్రతి సీన్ ను ఆమె బాగా పర్ ఫార్మ్ చేసింది. అరవింద్ కృష్ణ రోల్ చిన్నదే అయినా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది. జయప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి..ఇలా ప్రతి పాత్ర మీనింగ్ ఫుల్ గా ఉంది. కథలోనే ఈ పాత్రలన్నీ ఇమిడిపోయాయి.

సంగీత దర్శకుడిగా అనూప్ తన బెస్ట్ బీజీఎం, సాంగ్స్ ఇచ్చాడు. బీజీఎం మనం సినిమాను గుర్తుతెచ్చింది. కెకె రాసిన ఫియర్ సాంగ్ మంచి టైమింగ్ లో వచ్చింది. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఫియర్ కు మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఫియర్ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ తమ కుటుంబంతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు.

రేటింగ్ 4.5/5