రివ్యూ – ధోనీ నిర్మించిన “ఎల్ జీఎం” మూవీ

నటీనటులు – హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, దీపకుమార్, యోగి బాబు, వినోదిని వైద్యనాథన్ తదితరులు

సాంకేతిక బృందం – సినిమాటోగ్రఫీ – విజ్వజిత్, ఎడిటింగ్ -ప్రదీప్ ఈ రాఘవ్, నిర్మాతలు – సాక్షి సింగ్ ధోని, వికాస్ హసిజ, షర్మిల జె రాజా, ఎంవీఎం వేల్ మోహన్, సంగీతం, దర్శకత్వం – రమేష్ తమిళ్ మణి.

స్టోరీ

గౌతమ్ (హరీశ్ కల్యాణ్), మీరా (ఇవానా)కు ఒకరంటే మరొకరికి ఇష్టం. కొన్నాళ్ల ప్రేమ తర్వాత వీళ్లు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే గౌతమ్ తల్లి నదియా తనకు కాబోయో కోడలతో కొద్ది రోజులు టూర్ వెళ్లాలనుకుంటుంది. కోడలు మనస్తత్వం తెలుసుకోవాలనేది నదియా ప్రయత్నం. వీళ్లు కూర్గ్ వెకేషన్ కు వెళ్తారు. ఈ వెకేషన్ లో మీరా, తల్లి నదియా ఒకరి మీద మరొకరి మంచి అభిప్రాయం ఏర్పర్చుకుంటారని గౌతమ్ ఆశిస్తాడు. అయితే మీరా, నదియా మధ్య గతంలో జరిగిన చిన్న ఘటన వారి మధ్య మరింత దూరాన్ని పెంచుతుంది. ఆ తర్వాత ఏమైంది. గౌతమ్ ఆశించినట్లు జరిగిందా, వాళ్ల పెళ్లికి ఆటంకాలు తొలిగాయా లేదా అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

మోడరన్ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది. వాళ్లు పెళ్లి అనే అంశాన్ని చూసే కోణం ఎలాంటిది అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది. కథంతా హీరో హీరోయిన్లతో పాటు నదియా చుట్టూనే తిరుగుతుంది. కథ కొత్తగా అనిపించినా…దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకునేలా లేదు. కథనం, క్యారెక్టర్స్ బిహేవింగ్ లో సహజత్వం కనిపించదు. ఆకట్టుకునే ఎమోషన్స్ కు కథలో అవకాశం ఉన్నా అవేమీ మెప్పించవు. అలాగే ఎంటర్ టైన్ మెంట్ క్రియేట్ చేయడంలోనూ దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. ఫలితంగా అటు ఎమోషన్, ఇటు ఎంటర్ టైన్ మెంట్ లేక ఎల్ జీఎం ఢీలా పడింది.

క్రికెటర్ ధోనీ తన ఫస్ట్ ప్రొడ్యూసింగ్ వెంచర్ కు డీసెంట్ కథనే ఎంచుకున్నాడు. అతనుకున్న పేరుకు ఏమాత్రం ఇబ్బంది కలిగించని సినిమా ఇది. అయితే అతని తొలి ప్రయత్నం మాత్రం సక్సెస్ కాలేదు. కొత్త ఫీల్డ్ కాబట్టి ఇవన్నీ అనుభవాలే అనుకోవచ్చు. హరీశ్ చూసేందుకు బాగున్నా..అతని పర్ ఫార్మెన్స్ మెప్పించదు. అలాగే లవ్ టుడే లో ఇవానా యాక్టింగ్ ఇష్టపడిన వారికీ ఆ రేంజ్ లో ఎల్ జీఎంలో స్కోప్ దక్కలేదు. నదియా క్యారెక్టర్ మాత్రం స్టార్టింట్ టు ఎండింగ్ ఇంప్రెస్ చేస్తుంది. యోగిబాబు కామెడీ కూడా నవ్వించలేకపోయింది.

రొమాంటిక్ కామెడీస్ మంచి మ్యూజిక్ తో మరింత ఎలివేట్ అవుతాయి. ఆడియెన్స్ కు చేరుతాయి. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా అలాంటి అడ్వాంటేజ్ ఏదీ దక్కలేదు. సినిమాలో కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. ఓవరాల్ గా దీన్నొక ఓటీటీ మూవీగా కన్సిడర్ చేసుకోవచ్చు.