గేర్ మార్చబోతున్న “గేమ్ ఛేంజర్”

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) నటిస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్(Gamechanger). సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ ఛేంజర్ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. క్రిస్మస్ కు రావాల్సిన గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వస్తున్నట్టుగా ప్రకటించారు. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ గేర్ మార్చబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. దిల్ రాజు(Producer Dil raju) ఏం చేయనున్నారు..?

గేమ్ ఛేంజర్ మూడేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 ఫ్లాప్ అవ్వడంతో ఆ ప్రభావం ఈ మూవీ పై పడిందని టాక్ వినిపిస్తోంది. జరగండి.. జరగండి… అంటూ సాగే పాట రిలీజ్ చేస్తే అంతగా ఆకట్టుకోలేదు. ఇటీవల రిలీజ్ చేసిన పాటతో ఫరవాలేదు అనిపించింది కానీ.. సినిమా పై మాత్రం ఆశించినంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. దీంతో గేమ్ ఛేంజర్ మేకర్స్ గేర్ మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ టీజర్ ను దీపావళికి రిలీజ్ చేసే టార్గెట్ తో ప్రస్తుతం టీజర్ ఎడిటింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిసింది.

గేమ్ ఛేంజర్ టీజర్ తో మూవీ పై మరింతగా క్యూరియాసిటీ పెంచాలి అనేది ప్లాన్. రామ్ చరణ్ కొచ్చిన గ్లోబల్ ఇమేజ్ ఓవర్సీస్ మార్కెట్ లో వాడుకోవచ్చు కానీ సగటు మాస్ ఆడియన్స్ ని గేమ్ ఛేంజర్ చేరుకోవాలంటే మాత్రం మాస్ కంటెంట్ ని పబ్లిసిటీలో చూపించాల్సిందే. అందుకనే టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ చూపించేలా ప్లాన్ చేస్తున్నారట. టీజర్ రిలీజ్ తర్వాత నుంచి ప్రమోషన్స్ లో స్పీడు పెంచుతారట. జనవరి 10 విడుదలకు ఇంకో 75 రోజులు మాత్రమే సమయముంది. ప్రస్తుతం ఫస్ట్ గేర్ లోనే ఉన్న రామ్ చరణ్ బండి వీలైనంత త్వరగా థర్డ్ గేరుకి వెళ్ళిపోయి స్పీడ్ పెంచాలని ఫిక్స్ అయ్యారట. మరి.. టీజర్ తో గేమ్ ఛేంజర్ కు కావాల్సినంత బజ్ వస్తుందో లేదో చూడాలి.