తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు, సి.కళ్యాణ్‌ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ ఎన్నికలు ఉత్కంఠగా జరిగాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? దిల్ రాజు గెలుస్తాడా..? సి.కళ్యాణ్‌ గెలుస్తాడా..? అని టాలీవుడ్ జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది. ప్రొడ్యూస‌ర్ సెక్టార్‌లో దిల్ రాజు ప్యాన‌ల్ లీడింగ్‌ని ప్ర‌ద‌ర్శించింది. పోటీప‌డిన 12 మందిలో దిల్ రాజు ప్యాన‌ల్ స‌భ్యులు ఏడు గురు విజ‌యం సాధించ‌డం విశేషం. ఇక స్టూడియో సెక్టార్‌లో గెలుపొందిన న‌లుగురు స‌భ్యుల్లో ముగ్గ‌రు దిల్ రాజు వ‌ర్గాల‌ని చెందిన వారే. ఇక డిస్ట్రిబ్యూష‌న్ సెక్టార్‌లో దిల్ రాజు , సి. క‌ల్యాణ్ ప్యానల్ ల త‌రుపున చెరో ఆరుగురు స‌భ్యులు విజ‌యం సాధించారు. ఏ సెక్టార్‌లో చూసినా దిల్ రాజు ప్యాన‌ల్ హ‌వా క‌నిపించింది.

ఉత్కంఠగా జరిగిన ఎన్నికల్లో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిని దిల్ రాజు కైవసం చేసుకున్నారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది సోదరులు నా వెనకుండి నన్ను గెలిపించారు. అందరికీ ధన్యవాదాలు. రేపటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా వర్క్ స్టార్ట్ చేయాలి అన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ గా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు.